పహెల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే భారత విమానాలు తమ గగనతలంలోకి రావొద్దంటూ నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్. పాక్ ను అష్ట దిగ్బంధనం చేస్తున్న భారత్.. మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారత్ కూడా పాకిస్థాన్ విమానయాన సంస్థలకు భారత గగనతంలోకి రాకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉంది. పాకిస్థాన్ నౌకలకు భారత్‌లోని పోర్టుల్లో నిలిపే అవకాశాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉంది.
గగనతలంపై నిర్ణయం అమల్లోకి వస్తే పాక్ దక్షిణాసియా దేశాలకు విమానాలను చైనా లేదా శ్రీలంక మీదుగా పంపించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని పాక్ విమానయాన సంస్థలు భారత గగనతలం మీదుగా ప్రయాణించడం లేదు. పాక్ విమానాలు కౌలాలంపూర్, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌కు దగ్గరి దారి భారత్ మీదుగానే ఉంటుంది. ఇది ప్రయాణ సమాయన్ని పెంచడంతో పాటు తలకు మించిన భారమవుతోంది. ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఎయిర్‌లైన్ సంస్థలకు ఇది మరింత అదనపు భారాన్ని మోపుతుంది.
పాక్ తీసుకన్న నిర్ణయంతో ఇప్పటికే ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే ఒక వారంలో భారత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 800 విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణించేవి. దీని వల్ల పాక్ రోజుకు లక్షా 20 వేల డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడీ ఆదాయాన్ని నష్టపోతుంది పాక్. గతంలో కూడా ఐదు నెలల పాటు భారత విమానాలపై రాకపోకలపై నిషేధం విధించి 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నష్టపోయింది. ఇప్పుడు మళ్లీ అదే నిర్ణయం తీసుకొని మరింత నష్టపోనుంది.