కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇంటింటికీ ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. మన దేశంలో ఇప్పటివరకు బీసీ జన గణన సైంటిఫిక్‌గా తేల్చలేదన్న భట్టి విక్రమార్క.. మొదటిసారి తేల్చింది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ జన గణనను ఏ సర్వే తోనూ పోల్చలేరని చెప్పారు. 2011లో జరిగిన జనగణన లో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతర జనాభా లెక్కలు మాత్రమే తేల్చారని, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికం కాదన్నారు. అసలు కేసీఆర్ సర్కార్ చేసిన సర్వేను క్యాబినెట్లోనే పెట్టలేదని, శాసనసభలో కూడా చర్చకు పెట్టలేదని, కాబట్టి కేసీఆర్ చేయించిన సర్వే చెల్లుబాటు కాదన్నారు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామని భట్టి విక్రమార్క చెప్పారు. దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలని సూచించారు. బీసీ సర్వే అధికారికంగా జరగడం వల్ల బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే సర్వే బాగాలేదంటూ తప్పుడు ప్రచారం చేసి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం దక్కకుండా ఆ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు.
తెలంగాణలో బీసీ సర్వే విజయవంతం అయితే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను నడిపిస్తున్న బీజేపీపై ఒత్తిడి పెరుగుతుందన్న కారణంతోనే బీజేపీ నేతలు తెలంగాణలో చేపట్టిన సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీయే తమ నాయకుడని, రాహుల్ ఎజెండానే తమ ఎజెండా అని.. తనకు వచ్చిన ఉద్యోగాన్ని సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు భట్టి విక్రమార్క. సర్వే పారదర్శకంగా జరగాలని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, ఎక్కడా రాజీ పడవద్దని ప్రణాళిక శాఖా మంత్రిగా ఉన్న తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని ఆధారాలు అధికారికంగా నిక్షిప్తం చేశామని, 8 కోట్ల పేజీలకు పైబడిన సమాచారం సర్వే ద్వారా సేకరించామని డిప్యూటీ సీఎం చెప్పారు.