కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల నియోజవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులైన ఓటర్లకు సిపిఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారని, అలాగే, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారని.. అందుకే కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్నేహ ధర్మం ప్రకారం సానుకూలంగా స్పందించినట్లు కూనంనేని తెలిపారు.
పట్టభద్రుల శాసనమండలి నియోజవర్గం నుండి బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానం, యుజిసి చట్టంలో తీసుకొస్తున్న సవరణల వంటి చర్యల ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటోందని, రాజ్యాంగం కల్పించిన సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కూనంనేని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రం నుండి చెల్లించిన పన్నుల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటానే ఇచ్చిందే తప్ప తెలంగాణకు అదనంగా చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను ఇప్పటివరకు పూర్తి చేయలేదని పట్టభద్రుల ఎన్నికల కోసమే నిజామాబాద్ పసుపు బోర్డు తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారని, దానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. అలాగే, గిరిజన విశ్వ విద్యాలయానికి కూడా నిధులు ఇవ్వలేదన్నారు. ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ఇచ్చిన హామీ నీటి మూటలయ్యాయని ఆయన ఆరోపించారు.