-
కేంద్ర జలవనరుల శాఖామంత్రి పాటిల్ తో భేటీ సానుకూల స్పందన
-
కేఆర్‌ఎంబీ నిబంధనల ఉల్లంఘన పై చర్చ
-
సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా
-
సమావేశానికి డుమ్మా కొట్టిన ఏపీ సర్కార్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన కృష్ణా నది జలాల వివాదం పరిష్కారానికి గాను శుక్రవారం కేఆర్‌ఎంబీ రంగంలోకి దిగింది. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన జాతీయ నీటిపారుదల శాఖా మంత్రుల సదస్సులో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర జలవనరుల శాఖామంత్రి సి.ఆర్.పాటిల్‌తో పాటు కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే…
ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన కేంద్రం వివాదం పరిష్కారానికి గాను కేఆర్‌ఎంబీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో శనివారం
కేఆర్‌ఎంబీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులు హాజరు కావాలంటూ సూచించింది. కేఆర్‌ఎంబీ సూచనల మేరకు తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇ.ఎన్.సి అనిల్ కుమార్‌తో పాటు నల్లగొండ జిల్లా సి.ఇ అజయ్ కుమార్ హాజరై ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలు అక్రమ వినియోగంపై సమగ్రంగా వివరించారు. వాటాను మించి నీటి వినియోగాన్ని వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చెయ్యాలని వారు కేఆర్‌ఎంబీ ముందు తెలంగాణా రాష్ట్రం తరపున తమ తమ వాదనలు వినిపించారు.
అయితే, వివాదం పరిష్కారానికి గాను రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉండగా ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గైర్హాజరు అయ్యింది.
ఇదిలా ఉండగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలించుకపోతున్న నీటిని కేఆర్‌ఎంబీ కచ్చితంగా నిలువరించాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ కు లిఖిత పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై ఫిర్యాదు చేశారు.
శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్ నుండి నిబంధనలను ఉల్లంఘించి తరలించుకు పోతున్న నీటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. కేఆర్‌ఎంబీ రికార్డుల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకున్న హక్కులను మించి నీటిని వినియోగించుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్న అంశాన్ని 2024 నవంబర్ నుండి ప్రతినెల కేఆర్‌ఎంబీకి తెలంగాణా నీటిపారుదల శాఖ ఇ.ఎన్.సి లేఖల రూపంలో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయినా కేఆర్‌ఎంబీ ఏ రోజూ పట్టించుకోకుండా ఉపేక్షించడంతో ఇప్పుడు ఈ సమస్య జఠిలంగా మారిందన్నారు. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించుకుని పోయే హక్కు ఆంద్రప్రదేశ్‌కు ఎక్కడిదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అంతే గాకుండా, ఈ సంవత్సరం మే నెల మాసాంతానికి గాను తెలంగాణా రాష్ట్రానికి త్రాగునీరు, సాగునీరు 107 టి.యం.సీల నీటి అవసరాన్ని ఆయన వివరంగా చైర్మన్‌కు వివరించారు. తద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని 13 లక్షల ఎకరాలలో వేసిన రబీ పంటలను కాపాడడంతో పాటు, కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన రెండుకోట్ల మంది ప్రజల దాహార్తిని తీర్చాలని కేఆర్‌ఎంబీ చైర్మన్ కు రాసిన లేఖలో రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 650 టీఎంసీల నీటిని వినియోగించుకుందన్నారు. కాగా, తెలంగాణా రాష్ట్రం కేవలం 225 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014-15 లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 66:34 కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించి 75:25 నిష్పత్తిలో వాడుకుందని ఆయన తెలిపారు.
ఇప్పటికే తెలంగాణా ప్రాంతానికి అవసరమైన తాగు, సాగు నీటి వివరాలను సమగ్రంగా వివరించామని.. ప్రస్తుతం తెలంగాణాకు అవసరమైన 116 టీఎంసీల నీటిని అందించాలని, వాటిలో యం.జి.కే. ఎల్.ఐ.ఎస్ కు 24 టీఎంసీలు ఎన్.ఎస్.ఎల్.సికి 58 టీఎంసీలు, ఏ.యం.ఆర్.పి కి 34 టీఎంసీలు జూన్ మాసాంతానికి అవసరం ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తక్షణమే విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని రాహుల్ బొజ్జా కోరారు.