దక్షిణ కాశీ వేములవాడలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు నాలుగు లక్షల మంది భక్తులు హాజరై, స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లిస్తారని అంచనా వేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వినోద్ తెలిపారు. భక్తుల కోసం ఐదు లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
శివరాత్రి రోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అల్పాహారం పంపిణీ చేసేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యూ లైన్‌ల లోని భక్తులకు మజ్జిగ, పండ్లు అందజేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తిస్థాయికి చేరుకున్నాయని వివరించారు. ఉత్సవాలకు హాజరై అనారోగ్యం బారిన పడే భక్తుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు వేములవాడ పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.