భద్రాచలంలో పెను ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పేక మేడ మాదిరిగా భవనం మొత్తం ఉన్నచోటే కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు నాసిరకం నిర్మాణమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
భద్రాచలం పట్టణంలోని పోకల బజార్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆరంతస్తుల భవనం కుప్పకూలడంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. కొందరు మరణించగా.. మరికొందరు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొక్లెయిన్ సహాయంతో శిథిలాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిలో నిర్మాణ కూలీలతో పాటు.. ఇంటి యజమాని కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఆరు అంతస్తుల భవనాన్ని అతి సన్నని పిల్లర్లతో, కేవలం ఆరు అంగులాల పిల్లర్లతో నిర్మిస్తు్నారు. దీనిపై స్థానికులు ఇంతకు ముందే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, ఆ ఇంటి యజమాని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు.. అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కేవలం జీ ప్లస్ టు నిర్మాణానికి అనుమతులు తీసుకొని… ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతకుమించి ఎత్తున నిర్మాణం చేపడుతుండటంతో గతంలోనే ఈవో భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి నిర్మాణ సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. అయితే, అధికారులు నిర్మాణ పనులు నిలిపేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ.. గ్రౌండ్ ఫ్లోర్‌లో పిల్లర్లు సరి చేస్తుండగా.. ఆరు అంతస్తులు మొత్తం ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఈ సంఘటనతో పోకల బజార్ వాసులు ఉలిక్కి పడ్డారు. భవనం కూలిపోయిన సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలను విస్మరించి నిర్మాణం చేపడుతున్నా.. స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా.. అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నిర్మాణం తీరును పరిశీలించిన అధికారులు నిర్మాణ సమయంలోనే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చేయిస్తే బాగుండేదని, లేదంటే, ఆ ఇంట్లో ఎవరూ ఉండకుండా, అక్కడ నిర్మాణ పనులు జరగకుండా చర్యలు తీసుకుంటే.. ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.