శ్యామ్ బెనెగల్ ఇక లేరు. కానీ సినీ ప్రేమికుల హృదయాల్లో నిత్యం జీవించే ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాపై చూపిన ప్రభావం అలాంటిది మరి. ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్ని ఇచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనెగల్. కాపీ రైటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత డాక్యుమెంటరీలతో పరుగులు అందుకొని.. క్లాసిక్ సినిమా డైరెక్టర్‌గా దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు శ్యామ్ బెనెగల్. పద్మశ్రీ, పద్మ భూషణ్, దాదా సాహేబ్ ఫాల్కే, ANR నేషనల్ అవార్డ్ ఇలా ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. రెండు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. అలాంటి శ్యామ్ బెనెగల్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు ముంబైలోని ఓ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.
పుట్టింది.. పెరిగింది.. హైదరాబాద్‌లోనే..
శ్యామ్ సుందర్ బెనగల్‌కు హైదరాబాద్‌తో వీడదీయలేని సంబంధం ఉంది. ఆయన పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ అల్వాల్‌లోని చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. బెనెగల్ తండ్రి కర్ణాటకకు చెందిన వారు. కానీ హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఆయనకు ఫోటోగ్రఫీ స్టూడియో ఉండేది. అక్కడే బెనగల్‌కు సినిమా బీజం పడిందని చెప్పాలి. 12 ఏళ్ల వయసులో తన తండ్రి ఇచ్చిన కెమెరాతో ఓ చిన్న సినిమా తీశారు బెనగల్.
నిజాం కాలేజీలో ఎకానమిక్స్‌లో MA చేసిన బెనగల్.. అప్పుడే హైదరాబాద్‌లో ఫిల్మ్ సోసైటీని ఏర్పాటు చేశారు. నిజాం కాలేజీ కొలిజియం మ్యాగజైన్‌కు రెండేళ్ల పాటు ఎడిటర్‌గా ఉన్నారు. ఆయన చదువు అయ్యాక ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
ముంబైలో మొదలైన బెనగల్ ప్రస్థానం
1959లో ముంబైకి చేరుకున్న తర్వాత ఆయన చేసిన మొదటి పని కాపీ రైటర్‌గా చేయడం. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అలా ఎదుగుతూ క్రియేటివ్ హెడ్‌గా ఎదిగారు. ఆ తర్వాత బెనగల్ తన చూపును డాక్యుమెంటరీల వైపు తిప్పారు. 1962లో ఘెర్ బేతా గంగా అనే గుజరాతీ డాక్యుమెంటరీ తీశారు. ఇది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. 1963లో ASP అనే మరో అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారు. తన కెరీర్లో 900 అడ్వర్టైజింగ్, డాక్యుమెంటరీలు చేశారు. ఇక 1966 నుంచి 1973 మధ్య పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పాఠాలు చెప్పారు బెనగల్. ఈ సమయంలో రెండు సార్లు ఆ ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ సమయంలోనే తన డాక్యుమెంటరీలను కూడా పరుగులు పెట్టించారు. 1967లో చేసిన ఏ చైల్డ్ ఇన్ ది స్ట్రీట్స్ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చిపెట్టింది. అలా డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు కలిపి 70 వరకు చేశారు శ్యామ్ బెనగల్.
ప్రారంభమైన బెనగల్ శకం..
అంకుర్.. శ్యామ్ బెనగల్ తొలి సినిమా. సాధూ మెహర్, అనంతనాగ్, షబానా ఆజ్మీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. అంటరానితనం, ఆర్థిక అసమానతలే ప్రధాన అంశంగా వచ్చింది ఈ సినిమా. తెలంగాణలో జరిగిన ఘటనలను చూసి రాసుకున్న కథ ఇది. స్టూడియోల్లో కాకుండా..తెలంగాణ మారుమూల పల్లెల్లో ఈ సినిమా షూట్ చేశారు. ఈ సినిమా ఆయనకు జాతీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకొచ్చింది. జాతీయ ఉత్తమ నటుడిగా సాధూ మెహన్, ఉత్తమ నటిగా షబానా అజ్మీకి అవార్డులు వచ్చాయి. 1975లో నిషాంత్, 1976లో మంథన్, 1977లో భూమిక చిత్రాలను తెరకెక్కించారు. ఇవన్నీ కూడా భారతీయ చలనచిత్రాల్లో ఓ క్లాసిక్‌గా ముద్ర వేశాయి. నసీరుద్దీన్ షా, ఓమ్ పూరి, స్మితా పాటిల్, షబానా అజ్మీ, కుల్బుషన్, అమ్రిష్ పూరీ లాంటి వారిని తెరపైకి తీసుకొచ్చిన ఘనత బెనగల్దే. ఇండియాలో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు కూడా ఆయన పుణ్యమే.
ఆయన సినిమాలు అన్నీ క్లాసిక్సే. అందుకే ఆయనకు సరైన రిలీజ్లు దక్కేవి కావు. దీంతో ఆయన ఫోకస్ టీవీపై పెట్టారు. పలు సీరియల్స్ కూడా తీశారు. 1986లో ఇండియన్ రైల్వేస్ కోసం యాత్ర అనే సీరియల్‌ను రూపొందించారు. జవహర్ లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా భారత్ ఏక్ కోజ్ అనే సీరియల్‌ను 1988లో నిర్మించారు. భారతీయ సినిమా ముఖచిత్రం మారుతున్న సమయంలో ఈ సీరియల్ ఆయనను ఆదుకున్నదనే చెప్పాలి. ఆ తర్వాత రెండు దశాబ్ధాల వరకు కూడా ఆయన సినిమా రంగానికి తన సేవలందిస్తూనే ఉన్నారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు 1980 నుంచి 1986 వరకు డైరెక్టర్ గా ఉన్నారు శ్యామ్ బెనగల్.
1994లో మమో, 1996లో సర్ధారి బేగమ్, 2001లో జుబేదాను ఆయన తెరక్కించారు. జుబేదాతో ఆయన మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఈ మూవీలో కరిష్మా కపూర్ నటించగా.. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 2005లో నేతాజీ సుభాష్ చంద్రబోస్: ద ఫర్గాటన్ హీరో ఆయనను మరో మెట్టు ఎక్కించింది. సత్యజిత్ రే, నెహ్రూపై బయోగ్రఫికల్ మూవీస్ తీశారు. జూనూన్ మూవీకి బెస్ట్ డైరెక్టర్‌గా ఫిలీంఫేర్ అవార్డ్ అందుకున్నారు.
తెలుగులో ఒక సినిమా
మరాఠీ నవల కొండోరా ఆదారంగా 1978లో శ్యామ్ బెనగల్ తీసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు స్పెషల్. ఆ సినిమా పేరు అనుగ్రహం. ఈ మూవీలో అనంత్‌నాగ్, వాణిశ్రీ జంటగా నటించారు. ఈ మూవీ పలు అవార్డులను అందుకోవడంతోపాటు నటిగా వాణిశ్రీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్యామ్ బెనెగల్ తెలుగులో తీసిన ఏకైక సినిమా అనుగ్రహం.
ఇండియాన్ సినిమాకు ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఆయన సినిమాలన్నీ విప్లవాత్మక, అభ్యుదయ ఆలోచనలు కలబోసినవే. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేవే. గ్రామీణ ప్రజల వాస్తవ రూపాన్ని కళ్లకు కట్టాయి ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు. సమాజంలో ప్రజలు.. ముఖ్యంగా మహిళలు పడుతున్న వ్యథలను.. యధార్థంగా తెరపైకి ఎక్కించారు. సత్యజిత్ రే తర్వాత అంతర్జాతీయంగా భారతీయ సినిమాకు అంతటి ఖ్యాతీని తీసుకొచ్చింది శ్యామ్ బెనగల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తన జీవిత చరమాంకం వరకు భారతీయ సినిమాకు ఏదో ఓ రకంగా సేవలను అందిస్తూనే ఉన్నారు శ్యామ్ బెనగల్. అందుకే ఆయన మరణం భారతీయ సినిమాకు ఓ లోటు. ఆయన సేవలు అజరామరం.