- కనీసం 11,500 మంది సిబ్బంది అవసరం..
- ఆర్టీసీకి ఆదాయమే అంతంత మాత్రం..
ఏపీలో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు మరింత ఆలస్యం అయ్యే లా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ముగ్గురు మంత్రుల కమిటీని వేసిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనానికి ఆదేశించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం దీన్నిస్టడీ చేయాలని సీఎం ఆదేశించారు…. హోంమత్రి అనిత, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు కమిటీ సభ్యులుకాగా,రవాణశాఖ ముఖ్యకార్యదర్శి ఈ మంత్రివర్గ ఉప సంఘానికి కన్వీనర్ గా ఉంటారు. వీరంతా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పర్యటించి , పరిశీలించి ఈ హామీ అమలుపై మూడు నెలల్లో ఒక నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
చేతులెత్తేసిన ఆర్టీసీ…
మరోవైపు ఈ పథకం అమలుకు ఆర్టీసీ ఎంత ఫిట్ గా ఉందన్న అంశంపై ఆర్టీసీ అధికారులు ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ పథకం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగే అవకాశముంది. ఆ పెరిగిన తాకిడిని తట్టుకునే సమర్ధత ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు కష్టమేనని తేలింది. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే రోజుకు కనీసం పదిలక్షల మంది ఈ సర్వీస్ ను వినియోగించుకునే అవకాశముంది. ఆ రద్దీని తట్టుకోవాలంటే ఇప్పుడున్న బస్సులకు తోడు అదనంగా రెండు వేల బస్సులు అవసరమవుతాయని లెక్క తేలింది. పైగా ఆసర్వీసుల్లో అంతరాయం లేకుండా నడపాలంటే సిబ్బంది కూడా సరిపోరు. దాదాపు మొత్తంగా 11,500 మంది సిబ్బంది అవసరమవుతారు. ఐదు వేల మంది డ్రైవర్లు, మరో ఐదు వేల మంది కండక్టర్లు, 1500 మంది మెకానిక్కులు అవసరమవుతారు. ఈ యంత్రాంగం అంతా రెడీగా ఉంటేనే ఆ పథకం అమలు సాధ్యపడుతుంది.
దీనికి తోడు బస్సులు ఉచితంగా నడపాలి కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది. దానికి ప్రత్యామ్నాయం ఏంటన్నది ఆలోచించాలి.పైగా ఏఏ రూట్లలో ఈ సర్వీసులు రద్దీగా ఉంటాయి? ఎక్కడ ఎక్కువ సర్వీసులు అవసరమవుతాయి? టెక్నికల్ గా ఇప్పుడున్న బస్సులు ఈ సర్వీసులను టేకప్ చేయడానికి సిద్దమేనా లాంటి కీలక అంశాలపై ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు ఈ పథకం అమలు కష్ట సాధ్యమే. మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి. కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ పథకాన్నే కూటమి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది..