29.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

హైడ్రాను మూసేయాలా? నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్‌లో నిర్మాణాల కూల్చివేత విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి న్యాయస్థానం కన్నెర్ర చేసింది. జీవో 99కి విరుద్ధంగా కార్యాచరణ ఉంటే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు వార్నింగ్‌ ఇచ్చింది. కొంత మంది వ్యక్తిగత కక్షలతో హైడ్రాను అడ్డుపెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని వాటి ఆధారంగా నిర్మాణాలు కూల్చివేయడం సరికాదన్నారు. కేవలం పేపర్లను చూసి హక్కులను ఎలా నిర్థారిస్తారని, హక్కులు నిర్ణయించే అధికారం ఎక్కడుందని నిలదీసింది. ముందుగా నోటీసులు ఇచ్చి.. బాధితులు వివరణ ఇవ్వడానికి అవసరమైనంత గడువు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారదా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో తన స్థలంలో నిర్మించిన షెడ్‌ను పత్రాలేవీ పరిశీలించకుండానే కూల్చేశారంటూ బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సాగించిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. హైడ్రాకు చురకలంటించింది. హైడ్రా ఇన్స్‌పెక్టర్‌ రాజశేఖర్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. పార్క్‌ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదుతోనే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. అలాగే, పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని హైడ్రా తరపు న్యాయవాది రవీందర్‌రెడ్డి కోర్టు దృస్టికి తెచ్చారు. గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారు? ఇన్నేళ్లు ఏం చేశారని న్యాయమూర్తి నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు. పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్నారని అదే అసోసియేషన్ హైడ్రా రాక ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్కు ఆక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేల్చుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పార్కు స్థలంలోకి వచ్చారని ఎలా చెబుతున్నారని దాన్ని నిర్ణయించడానికి మీరెవరని హైకోర్టు నిలదీసింది. హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించింది. ఇక్కడ లేఅవుట్‌కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని ఆ అధికారం సర్పంచ్‌కు ఎక్కడుందన్నారు. పిటిషనర్‌ను కబ్జాదార్లుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ను హైకోర్టు నిలదీసింది. కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరని ప్రశ్నించింది. కాగా, తాను పిటిషనర్‌ను సమర్థించడంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషనర్‌కు చెందిన స్థలంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com