తెలంగాణలో మార్చి రెండో తేదీ నుంచి 31వ తేదీ వరకు షాపులను 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈమేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రంజాన్ మాసం సందర్భంగా ఈ వెసులుబాటును షాపుల యజమానులు ఉపయోగించుకోవచ్చు. అయితే, కార్మికశాఖ నిబంధనలు మాత్రం అన్ని వ్యాపార సంస్థలు కచ్చితంగా అమలు చేయాలని షరతు విధించింది. తమ తమ సంస్థల్లో, వ్యాపార సముదాయాల్లో పనిచేసే సిబ్బందికి రోజుకు 8 గంటలు, లేదా వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే యాజమాన్యం మామూలు వేతనం కన్నా రెట్టింపు జీతం చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీవో నం.476 ప్రకారం సెలవు రోజుల్లో పని చేస్తే సీఆఫ్ అమలు చేయాలని సూచించింది.
మరోవైపు.. రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 3వ తేదీ నుంచి మార్చి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, బోర్డ్స్, కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఆఫీస్ల నుంచి, స్కూళ్ల నుంచి వెళ్లిపోవచ్చని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్లో వివరాలను వెల్లడించింది. ముస్లిం ఉద్యోగులకు వీలుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.