అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్‌కు సంబంధించిన వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో పలువురు తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 13 మంది తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గతంలో 20 సంవత్సరాల కాలపరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. అయితే, అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఉమ్మడి కడప జిల్లాలో ఈ వ్యవహారంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారణ సాగించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తహశీల్దార్లుగా పనిచేసిన మైదుకూరు తహశీల్దార్ అనూరాధ, పోరుమామిళ్ల తహశీల్దార్ వి.గంగయ్య, బద్వేల్ తహశీల్దార్ మధుసూదన్ రెడ్డి, వీఎన్ పల్లె తహశీల్దార్ విజయకుమారి, లింగాల తహశీల్దార్ లక్ష్మీనారాయణ, సిహాద్రిపురం తహశీల్దార్ మహబూబ్ బాషా, జమ్మల మడుగు తహశీల్దార్ గుర్రప్ప, పెండ్లిమర్రి తహశీల్దార్ ఉదయభాస్కర్ రాజు, బి.మఠం తహశీల్దార్ సువర్ణ, కమలాపురం తహశీల్దార్ సరస్వతి, కాశినాయన తహశీల్దార్ రామచంద్రుడు, వేముల తహశీల్దార్ వెంకటసుబ్బయ్య, వల్లూరు తహశీల్దార్ శంకర్రావులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా మైదుకూరు, లింగాల, బి.మఠం, జమ్మలమడుగు మండలాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు చెబుతున్నారు.
- Advertisement with us -