ఏపీలో కూటమి సర్కారు జోష్‌లో కనిపిస్తోంది. పాలనాపరంగా తమకు అనుకూలమైన పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్న ఆలోచనతో తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం లేదన్న భావన ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి కొండంత అండగా నిలుస్తోంది. ఆ పార్టీ మండలిలో బలమైన వాయిస్ వినిపించగలుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి పై చేయి సాధించాలని కూటమి భావించింది. కానీ, ఆ ప్రయత్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ద్వారా ఆ రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో, కూటమి ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. ఏకంగా శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజును దించేయాలన్న నిర్ణయానికి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ పార్టీ బలం శాసనమండలిలో 38. అయితే, ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారు రాజీనామాలు ప్రకటించి ఆరు నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేక.. వేరే పార్టీలో చేరలేక సతమతం అవుతున్నారు. తమ రాజీనామాను ఆమోదించాలని వారు లేఖలు రాస్తున్నప్పటికీ చైర్మన్ మోసేన్ రాజు స్పందించడం లేదు. తాము సరైన ఫార్మట్‌లోనే రాజీనామా చేసినా చైర్మన్ స్పందించకపోవడంపై రాజీనామా చేసిన వారంతా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయ పోరాటానికి సైతం సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ వంటి ఎమ్మెల్సీలు రాజీనామా బాట పట్టారు. ఇటీవల శాసనమండలి వైస్ చైర్మన్ జియాఖానం సైతం రాజీనామా చేశారు. అయితే వీరంతా ఫార్మట్‌లోనే రాజీనామా చేసినా.. మండలి చైర్మన్ ఆమోదించడం లేదంటున్నారు. ఆ రాజీనామాలను పెండింగ్‌లో పెట్టేశారు. కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదట. అయితే, వారంతా రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరాలనుకున్నారు. అలా ఖాళీ అయిన స్థానాలు కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే కూటమి బలం అమాంతం పెరగనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుముఖం పట్టనుంది. అందుకే శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.మరోవైపు.. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు పదవీకాలం 2028 వరకు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి.. కూటమి బలం పెరగాలంటే మరో ఏడాదిన్నర వేచి చూడాల్సి ఉంది. అందుకే టీడీపీ కూటమి ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా చైర్మన్ మోసేన్ రాజుపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది ఎమ్మెల్సీల వరకు కూటమి వైపు వచ్చారు. ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అటువంటి వారితో అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయించి మోసేన్ రాజును చైర్మన్ కుర్చీ నుంచి దించేందుకు టిడిపి కూటమి గట్టిగానే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.