ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు జీవం తీసి కుట్రపూరితంగా జీరోని చేశారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిళ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. ప్రాజెక్టును ఉద్దరిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెపుతున్నవన్నీ పచ్చి అబద్దాలని ఆమె ఆరోపించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం 119.4 టీఎంసీలకు కుదించి బహుళార్ధ సాధక ప్రాజెక్టుని కాస్తా బ్యారేజీగా మార్చేశారని షర్మిళ ఆరోపించారు. కేవలం ఆర్ అండ్ అర్ ప్యాజీలను ఎగ్గెట్టేందుకే పోలవరాన్ని చంపేశారని అన్నారు. 22వేల కోట్లు మిగుల్చుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నారన్నారు. ఎత్తు తగ్గింపుతో ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరుగుతుంటే కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు కనిపించడం లేదా అని షర్మిళ ప్రశ్నించారు. బనకచర్ల మీద ఉన్న ప్రేమ చంద్రబాబుకు పోలవరం మీద లేదని ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా 41.15 మీటర్లకు డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నామని చెపితే నిలదీసే దమ్ము కూటమిలోని టీడీపీ, జనసేన సభ్యులకు లేదన్నారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఎట్టి పరిస్ధితుల్లో ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 194.6 టీఎంసీలు ఉండాల్సిందే అని షర్మిళ డిమాండ్ చేశారు. మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి, పోలవరం ప్రయోజనాలను కాపాడాలని ప్రధాని మోడీని వైఎస్.షర్మిళ కోరారు.
- Advertisement with us -