జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ దాడికి సంబంధించి భారత భద్రతా దళాలు విస్తృత స్థాయిలో ఉగ్రవాదుల నిర్మూలన చర్యలు ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, గూఢచర్య నివేదికలో వెలుగుచూసిన అంశాలు.. ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
పహల్గాం దాడి లష్కర్-ఏ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి రూపొందించిన పక్కా పథకానికి ఫలితంగా జరిగినట్లు గూఢచర్య సంస్థలు నిర్ధారించాయి. ఈ దాడికి సంబంధించి సైఫుల్లా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఫిబ్రవరి నెలలో సైఫుల్లా ఐదుగురు ఉగ్రవాదులతో సమావేశమై పహల్గాంలో ఉగ్రదాడికి ప్రణాళిక రచించాడు. తర్వాత మార్చిలో మరోసారి ఈ ఉగ్రవాదులు సమావేశమై దాడి ప్రణాళికను ఖరారు చేసుకున్నారు.
పహల్గాం దాడికి సంబంధించి సైఫుల్లా, అబూ మూసా, ఇద్రీస్ షాహీన్, మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ రఫా రసూల్, అబ్దుల్లా ఖాలిద్ లు కలిసి మిర్పూర్లో సమావేశమయ్యారు. అక్కడ దాడికి సంబంధించిన అన్ని వ్యూహాలపై చర్చించి అమలు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్లానింగ్ కు పాకిస్తాన్ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకు ఉగ్రవాదుల దాడులపై సంబంధం లేదని చెబుతున్నా, వాస్తవానికి పాకిస్తాన్ సైన్యం స్వయంగా సైఫుల్లాకు సహాయం చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి.
లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లాకు పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి నేరుగా ఆదేశాలు వచ్చాయని గూఢచర్య నివేదికల్లో పేర్కొన్నారు. సైఫుల్లా పాకిస్తాన్ ఆర్మీతో సంప్రదింపులు జరిపి, బహావల్పూర్లోని ప్రధాన కార్యాలయంలో అక్కడి ఆర్మీ అధికారులతో సమావేశమయ్యాడు. ఈ భేటీలకు సంబంధించిన ఫోటోలు కూడా తాజాగా బయటకు వచ్చాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో సైతం ఈ సమావేశాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడైంది.
ఏప్రిల్ 18న రావల్కోట్లో మరోసారి ఉగ్రవాదులు సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో సైఫుల్లాతో పాటు ఐదుగురు ఉగ్రవాదులు కనిపిస్తూ ఉన్నారు. ఈ వీడియో ఆధారంగా గూఢచర్య సంస్థలు పహల్గాం దాడి వెనుక ఉన్న కుట్రపై స్పష్టమైన అవగాహన పొందాయి. పహల్గాం దాడిలో కీలక పాత్ర పోషించిన అనుమానిత ఉగ్రవాది అదిల్ గురి ఇంటిని భారత భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉన్న అదిల్ గురి ఇంటిపై దాడిచేసి బాంబు పేల్చి కూల్చేశారు. అలాగే త్రాల్ ప్రాంతంలో ఆసిఫ్ షేక్ ఇంటిని కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి. మరోవైపు బండిపొర ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ మృతి చెందాడు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు గాయపడ్డారు.