27.7 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

చితక్కొట్టి… రూంలో బంధించి.. సంజయ్ రౌత్ పై తిరగబడ్డ శివసేన కేడర్

  • అఘాడీ నుంచి శివసేన దూరం జరుగుతోందా?
  • మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి?

శివసేన అంతర్మథనంలో పడిందా? అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి నేపధ్యంలో పార్టీ వైఖరిపై పునరాలోచనలో పడిందా? కూటమితో జట్టు కట్టడం వల్ల అసలుకే ఎసరొచ్చిందని భావిస్తోందా? అందులోనుంచి తప్పుకోవడమే మేలని భావిస్తోందా? బాల్ థాకరే వదలి వెళ్లిన బాటను కాదనడం వల్ల పార్టీ నష్టపోతోందని కేడర్ భావిస్తోందా? తాజా పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలే ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. పార్టీ అంతర్గత సమీక్షా సమావేశం రచ్చ రచ్చగా మారి రౌత్ పై దాడికి దారి తీసింది.

పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ను సొంత పార్టీ కార్యకర్తలే ఉతికి ఆరేశారు. మూకుమ్మడి దాడి చేసి చితక్కొట్టారు. అంతటితో వాళ్ల ఆవేశం చల్లారలేదు. రూంలో బంధించి తాళం వేశారు. సంఘటన జరుగుతున్నంత సేపు ఇదే సమావేశంలో ఉన్న ఉద్దవ్ థాకరే, ఆదిత్య థాకరే మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు. ఈ విషయం బయటకు వెల్లడి కానప్పటికీ సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.

మరో నాలుగు నెలల్లో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో పార్టీలో జరిగిన చర్చలో సంజయ్ రౌత్ కు, పార్టీ కేడర్ కు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం రేగింది. పార్టీ ఘోర పరాజయానికి మీరే బాధ్యులంటూ కేడర్ అంతా ఆయనపై ఎదురు తిరిగారు. సంజయ్ రౌత్ కూడా వారిపై చెలరేగిపోయారు. మాటా మాటా పెరిగి వాగ్యుద్ధం ముదిరిపోయింది. సహనం కోల్పోయిన కేడర్ ఆయన్ను చితక్కొట్టి, రూంలో పెట్టి రూమ్ కి తాళం వేశారు. కార్యకర్తల ఈ రియాక్షన్ కి ఉద్ధవ్, ఆదిత్యల నోట మాట రాలేదు. వాళ్ల స్పందన చూసి భయపడ్డారో లేక రౌత్ పై వీళ్లకున్న కసి కూడా తీరిందో ఏమో తండ్రీ, కొడుకులిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన ఇప్పుడు అత్యంత దౌర్భాగ్యకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. బాల్ థాకరే మరణం తర్వాత పార్టీ ఐడియాలజీ పై రకరకాల వాదనలు పుట్టుకొస్తున్నాయి. పొత్తులో పోటీకి వెళ్లడంతో అనేక మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో అంతర్గతంగా కేడర్ రగిలిపోతోంది.

నిరాశపరచిన ఫలితాలు..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అఘాడీని నిరాశ పరచగా శివసేన మరింత నీరసపడింది. ముఖ్యంగా శివసేన చీలిక దెబ్బ ఆపార్టీ భవితవ్యంపై ఘోరంగా పడింది. ఏకనాథ్ షిండే తన వర్గంతో వేరు కుంపటి పెట్టి పార్టీ గుర్తును కూడా కైవసం చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో మోడీ, షాల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో కూడా  కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలో పార్టీనే నమ్ముకుని సర్వస్వం నష్టపోయిన ఉద్ధవ్ వర్గంలో అసంతృప్తి మొదలైంది. పార్టీ కేడర్ ఈ పరాజయంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇదే నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, వ్యూహంపై చర్చించేందుకు ఉద్ధవ్ థాకరే నివాసమైన మాతోశ్రీలో పార్టీ సమావేశం జరిగింది.

సంజయ్ రౌత్ తీరుపై ఆగ్రహం

బాల్ థాకరే అనుచరుడుగా పేరు పడ్డ సంజయ్ రౌత్  మొదట్నుంచి వివాదాస్పద వైఖరే. కీలకమైన అంశాలపై ఆయన ప్రకటనలు,  స్టేట్ మెంట్లు పార్టీ కేడర్ కి రుచించడం లేదు. నోటి దురుసుతనం, దుర్భాషలాడటం, అసభ్యకరంగా తిట్టడం కేడర్ కి అస్సలు నచ్చటం లేదు. ఆయన దూకుడు వైఖరి వల్ల సొంత పార్టీలోనే ఆయనకు శత్రువులు ఎక్కువయ్యారు. మొన్న సమావేశంలో ఆయనపై దాడితో అది బహిర్గతమైంది.

ఒంటరి పోటీకే మొగ్గు…

మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశంలో ఉంది. అఘాడీ కూటమినుంచి బయటకొచ్చేయాలన్న అభిప్రాయం కేడర్ లో ఉంది. ఒంటరిగా బరిలోకి దిగితే అన్ని స్థానాలకూ పోటీ చేయవచ్చునని నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో శివసేన హై కమాండ్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి.పొత్తు ధర్మాన్ని పాటించి కలసే పొటీకి దిగుతుందో లేక ఒంటరిగా బరిలోకి దిగుతుందో చూడాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 స్థానాలతో అధికారం చేజిక్కించుకుంటే అఘాడీ కూటమి 50 స్థానాలకి పడిపోయింది. ఇందులో శివసేనకు కేవలం 20 సీట్లు వచ్చాయి. అధికారం చేజారడంతో పార్టీలో అసంతృప్తులు  పతాక స్తాయికి చేరుకున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com