- మరో 40 మంది పరిస్థితి విషమం
- సీఎన్జీట్యాంకర్ లో కెమికల్ నింపి ఉన్నట్లు సమాచారం
ప్రమాదాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. పెట్రోల్ బంకు ముందు పార్క్ చేసిన వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టడంతో ఏకంగా ఘోర అగ్నిప్రమాదానికి దారి తీసి తొమ్మిది మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రాజస్థాన్లోని జైపూర్ లో ఓ పెట్రోల్ బంకు ముందు జరిగిన ఈ ఘటన భారీ అగ్నిప్రమాదానికి దారి తీయడమే కాదు అనేక మందిని తీవ్రంగా గాయపరిచింది. జైపూర్ లో ఓ పెట్రోల్ బంకు ముందు సీఎన్జీ టాంకర్ ఒకటి పార్క్ చేసి ఉండగా, మరో వాహనం స్పీడుగా వెనకనుంచి ఇతర వాహనాలను ఢీకొంటూ చివరకు ఈ సీఎన్జీ వాహనాన్ని చాలా వేగంగా ఢీకొట్టింది. అంతే క్షణాల్లో మంటలు రేగాయి. అది కాస్తా చూస్తుండగానే తొమ్మిది మందిని స్పాట్ లోనే బలి తీసుకుంది. మంటలు ఎంతకూ అదుపులోకి రాకపోవడం వల్ల అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 28 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. మంటలు సమీపంలోని వాహనాలన్నింటినీ కమ్మేయడంతో వాటిని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 40 మంది గాయపడ్డారు. ట్యాంకర్ కు 300 వందల మీటర్ల పరిధిలో ఉన్న అన్నివాహనాలు చూస్తుండగానే బుగ్గి పాలయి పోయాయి. వందల కిలోమీటర్ల వరకూ నల్లని దట్టమైన మేఘాలు, పొగ ఆవరించడంతో స్పాట్ లో పరిస్థితి ఎలా ఉందో తెలీడం లేదు. సీఎన్జీ టాంకర్ పేలగానే, అక్కడే ఉన్న మరికొన్ని సీఎన్జీ వాహనాలు కూడా పేలిపోయాయి. ఆ శబ్దం దాదాపు పది కిలోమీటర్ల దూరం వినిపించిందంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
సీఎం దిగ్బ్రాంతి..
ప్రాధమిక సమాచారం ప్రకారం సీఎన్జీ ట్యాంకర్ లో ఏదో కెమికల్ నింపి ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎన్ని వాహనాలు దగ్ధమయ్యాయి అన్న విషయం ఇంకా బయటకు రాలేదు. రాజస్థాన్ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణం ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.