కేటీఆర్‌పై ఈ ఫార్ములా కేసు సక్రమమేనని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫార్ములా ఈ` కారు రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఈ రోజు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
అక్రమాలు జరిగినట్టు ఆధారాలున్నా… కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక ఇది అక్రమ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ ఆయన మాటల్లోనే…
చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలి. హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుండి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్ ఒత్తిడి తెచ్చారు. ఆధారాలు కనిపిస్తున్నా..అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయిస్తున్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వలే.. కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్ మంజూరు ఎలా చేస్తారు?
హద్దుల్లేని కేటీఆర్ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారు. నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాలకు నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చింది. నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్ అనుమతితోనే జరిగింది.
నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఫార్ములా ఈ` కారు రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచడమా..? బిఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. బిఆర్ఎస్ నేతలు ఏం చేసినా వారి స్వలాభం కోసమే? తెలంగాణ, హైదరాబాద్ కోసం కాదని ఈ అక్రమాలే నిరూపిస్తున్నాయి.
ఫార్ములా ఈ కారు రేసు పేరుతో నిధులు గోల్‌మాల్ చేసి ఇప్పుడు సుద్ధపూసగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపుల వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్ అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం భయపడం అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు