- ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు
- పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు
- ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, నిర్మాణ, ఆటోమొబైల్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో మానవ వనరుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనివాళ్ళ కొరత రోజు రోజుకూ తీవ్రమవుతోంది. గతంలోలా వ్యవసాయ పనులకు, ఇతరత్రా రంగాల్లో కూలి పనుల చెయ్యడానికి మనుషుులు దొరకడం లేదు. ఇది నిన్నమొన్న కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే శ్రామిక శక్తి కొరత ప్రారంభమయ్యింది. ప్రధానంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ కూలీలు దొరకడం తగ్గుముఖం పట్టింది. దానికి తోడు గడచిన రెండు దశాబ్ధలుగా ప్రభుత్వాలు ప్రజలకు లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తోడై పూర్తి స్ధాయిలో శ్రమికుల కొరత ఏర్పడింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ఈ మానవ వనరుల లేమిని దేశంలోని ఇతర రాష్ట్రాల శ్రామికులు ఆసరాగా చేసుకుని దాదాపు అన్ని రంగాల్లోనూ చొరబడ్డారు. గడచిన దశాబ్ధ కాలంగా పశ్చిమబెంగాల్, బీహార్, ఒరిస్సా, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రానికి చెందిన శ్రామిక వర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవస్ధీకృతం అయిపోయారు.
ఒకప్పుడు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయంటే ఊరిలో ఉన్న శ్రామికవర్గానికి పండగలా ఉండేది. అందరూ జట్లు జట్లుగా ఏర్పడి నాట్లు వేయడానికి ఊడ్పులకు, కోతలకు ఇలా సంవత్సరమంతా వ్యవసాయ పనులతో శ్రమించి నాలుగు రూపాయలు సంపాదించుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. సంక్షేమ పథకాల రూపంలో చేతినిండా డబ్బులు ఆడటంతో పనలుకు వెళ్లడం తగ్గించేశారు. వ్యవసాయ పనులకు రమ్మంటే కూలి రేట్లు వేలల్లో అడుతున్నారు. రైతులు ఈ కూలి రేట్లను భరించలేక పోతున్నారు. ఈ దశలో ఇతర రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రంలో వ్యవసాయ పనులకు రావడం ప్రారంభించారు. ముఖ్యంగా పదేళ్ల క్రితమే పశ్చిమబెంగాల్ రైతు కూలీలు ఉభయగోదావరి జిల్లాలకు వ్యవసాయ పనులకు రావడం మొదలైంది. వరినాట్ల నుంచి కోతలు, ఊడుపులు, చెరుకు కటింగ్, కూరగాయలు, పత్తి తెంపడం వంటి పనులన్నింటిలో బెంగాల్ శ్రామికులు స్ధిరపడిపోయారు. అలాగే ఇటుకబట్టీలు, డైరీ ఫారాలు, కోళ్ళ ఫారాలు, చేపల చెరువులు, రైసు మిల్లులు, ఇనుప కొలుములు ఇంలాంటి రంగాల్లో బీహార్ శ్రామికులు వచ్చి చేరిపోయారు.
చాలా సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఒడిషా నుంచి వలసలు పెరిగాయి. ఈ రాష్ట్రానికి చెందిన శ్రామికులు హోటల్ పరిశ్రమలో ఎక్కువగా చేరిపోయారు. హోటళ్ళో వెయిటర్ దగ్గర నుంచి క్లీనర్, డిష్ వాషింగ్, మాస్టర్ చెఫ్ ఇలా అన్ని పొజీషన్లను వీరు ఆక్రమించారు. వీళ్ళలో కొంతమంది ఏపనైనా చెయ్యడానికి సిద్దపడి వస్తున్నారు. ఆ క్రమంలోనే కోళ్ళ ఫారాలు, ఇటుకబట్టీల్లో కూడా ఒరిస్సా కార్మికులు పనులు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వలస కార్మికులైతే సులభ్ కాంప్లెక్సులను కూడా వదిలిపెట్టలేదు. వీటితో పాటు నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించారు. టైల్స్ వేయడం, శానిటేషన్ వర్క్స్, పెయింటింగ్స్, ఇంటీరియర్ డిజైనింగ్ ఇలా నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్ కార్మికులు వేళ్లూనుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారైతే ఎన్నో దశాబ్ధాల క్రితమే మన తెలుగు రాష్ట్రాల నలుచెరుగులా విస్తరించారు. చిన్నచిన్న పచారీ దుకాణాలు ప్రారంభించడం నుంచి టీస్టాళ్ళు, శానిటరీ దుకాణాలు, చిన్న చిన్న హోళ్ళు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళవే ఎక్కువ.
దక్షిణ భారతం నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాలకు వలసలు అధికమ్యాయి. భవన నిర్మాణ కూలీలుగా కర్నాటక రాష్ట్రం నుంచి అధికంగా శ్రామికులు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఇక కోతల కాలం వచ్చిందంటే తమిళనాడు నుంచి వరికోత యాంత్రాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగిపోతున్నారు తమిళ తంబిలు. కేరళ నుంచి వలసలు ఈ నాటివి కావు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళే కేరళీయులు నాలుగైదు దశాబ్ధాల క్రితమే మన రాష్ట్రాలకు వచ్చి స్ధిరపడ్డారు. ముఖ్యంగా కేరళీయులు బోధనా రంగంలో స్ధిరపడ్డారు. ఆంగ్ల భాషపై వీరు సాధించిన పట్టు కారణంగా తొంభై శాతం ప్రైవేటు పాఠశాల్లలో కేరళ టీచర్లే చాలా కాలంగా కొనసాగుతున్నారు. మన రాష్ట్రంలో శ్రామిక వర్గం రోజువారీ పనులు చెయ్యడానికి విముఖత వ్యక్తం చేస్తుండటంతో ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంపదను ఇతర రాష్ట్ర ప్రజలు తరలించుకుపోయే పరిస్ధితులు తలెత్తుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రామిక వర్గం ఇప్పటికే పని చేసే సంస్కృతికి దూరమైపోయారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు నిలిపివేస్తే సొంత రాష్ట్రాల్లోనే పనలు దక్కించుకోవడానికి ఇతర రాష్ట్ర శ్రామికులతో పోటీ పడే స్ధితికి దిగజారిపోతారు. రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణల్లో పని చేసే వారిని సంక్షోభ స్థితికి నెట్టివేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.