ఓ వైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది.. మరోవైపు బందీల విడుదల కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. ఒకేసారి మూడు బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అసలు పేలుళ్లు ఎందుకు జరిగాయి? ఎలా జరిగాయి? అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. దీని వెనక ఉగ్రవాదులు ఉండొచ్చని ఇప్పటికే ఇజ్రాయెల్ దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
పేలుళ్లు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్ల సర్వీసులను ఆపేశారు. అయితే ఇజ్రాయెల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కీలక సమాచారాన్ని రిలీజ్ చేశారు. వెస్ట్ బ్యాంక్‌లో తనిఖీలు నిర్వహించినప్పుడు దొరికిన కొన్ని వస్తువులు.. ప్రస్తుతం పేలుళ్లు జరిగిన ప్రాంతంలో లభించినట్టు తెలిపారు. దీంతో దీని వెనక హమాస్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అయితే అప్పుడే ఓ తుది నిర్ణయానికి రావడం లేదని.. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.
మరోవైపు పేలుళ్ల సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రక్షణ, ఇంటెలిజెన్స్‌తో ఇతర శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.