సికింద్రాబాద్ స్టేషన్ ఆనవాళ్లు చరిత్రలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది స్టేషన్ ముందు భాగాన ఉండే చారిత్రాత్మక కట్టడం. ఈ కట్టడానికి 150ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి కట్టడం కనుమరుగవుతోంది. సికింద్రాబాద్ అంటే మనందరికి గుర్తొచ్చేది రైల్వేస్టేషన్ భవన నమూనా. కూల్చివేలతో నాటి కళా సంస్కృతికి నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. ఈ పురాతన కట్టడాలను కూల్చేస్తున్నారు. ఇప్పటి వరకు స్టేషన్ వెనక భాగం పూర్తిగా కూల్చివేసి.. కొత్త భవనాల నిర్మాణం సాగిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే ముందు భాగం కూల్చివేతలు కూడా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇది రైల్వే స్టేషన్ ప్రధాన భవనం. ఇప్పటికే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అనేక రైళ్లను ఇతర స్టేషన్లలో నిలుపుదల చేసి ప్రయాణికులకు సమాచారమిస్తూ సేవలందించడమే కాకుండా.. ఇక్కడికే వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.నూతన భవన నిర్మాణం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ విధంగానూ తీసిపోకుండా నిర్మించడమే కాకుండా.. మరో వందేళ్ల వరకు పెరిగే ప్రయాణికుల తాకిడిని కూడా తట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనానికి ధీటుగా.. ఎటువంటి మౌళిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 1874లో అప్పటి నిజాం నవాబుల హయంలో నిర్మించారు.అయితే, ఇది 1916 వరకు నిజాం గ్యారెండెట్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్య్రం అనంతరం 1951లో దీన్ని జాతీయ పరం చేయడంతో.. భారత రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ ఒక భాగం అయిపోయింది. ప్రస్తుతం నిజాం ఆర్కిటెక్చర్‌కు అణగుణంగా కోటను పోలి ఉండేలా అప్పటి నిజాం పాలకులు దీన్ని డిజైన్ చేశారు.