- భవన నిర్మాణ కార్మికుల గగ్గోలు
- అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం
- భారీగా పడిపోయిన స్టాంపు డ్యూటీ
ఏపీలో ఇసుక సంక్షోభం మొదలైంది. ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాదు రిజిస్ట్రేషన్లు కూడా తగ్గిపోయాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్టాంపు డ్యూటీ దారుణంగా పడిపోయింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టేందుకు ఇసుకేది? అని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కూటమి నేతలు ఇసుకను బ్లాక్ లో విక్రయిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది. ప్రజలకు దక్కాల్సిన ఇసుకను ఎవరైనా బ్లాక్ లో విక్రయిస్తే, తనవారైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాదు మిత్రపక్షా ఎమ్మెల్యేలకు జాగ్రత్తగా ఉండమని ఘాటుగానే చెప్పారు. ఆ నాలుగు రోజులు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా ఇప్పుడసలు ఇసుకే దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.
సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఇసుక ఫ్రీ అన్నమాట అవాస్తవమనే అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కడికక్కడ సీనరేజీలు ఉన్నా, ఉచితం అమలు కావడం లేదని అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు చెప్పినట్టు ఇవ్వాలంటే ఇసుక సీనరేజి కట్టాలి. అలాగే అక్కడ పంచాయతీలు లేదా స్థానిక సంస్థలకు పన్నులు కట్టాలి. గోదావరి దగ్గర ఇసుక లోడింగ్ వాళ్లకివ్వాలి.
దూరాన్ని బట్టి ట్రాన్స్ పోర్టు లారీకి ఇవ్వాలి. టన్నుకి రూ.88 గుత్తేదారులకు ఇవ్వాలి. రీచ్ నుంచి ఒడ్డుకు తెచ్చిన ట్రాక్టరుకి ఎంతో కొంత ఇవ్వాలి. ఇలా ఇవన్నీ చూసుకుంటే తడిసి మోపెడవుతుందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే వైసీపీ సర్కారు ఉండగా 6 యూనిట్ల ఇసుక రూ.18 వేలు ఉండేది. డిమాండ్ ను బట్టి రూ.25 వేల వరకు అయ్యేది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రూ.40 వేలు పైనే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత ఖర్చు పెట్టలేని వాళ్లు లబోదిబోమంటున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణాలు ఆపేసి ఇసుక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరునెలలుగా పనుల్లేవని భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. ఇంకా కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు ఇలా ఇంటి నిర్మాణంతో అనుబంధం ఉన్న అందరూ ఖాళీగా ఉండటంపై నెట్టింట తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇంటి నిర్మాణంతో అనుబంధం ఉన్న వ్యాపార సంస్థలు కొనుగోళ్లు లేక ఉసూరుమంటున్నాయి. ముఖ్యంగా సిమెంటు, ఐరన్, శానిటరీ, టైల్స్, పెయింట్స్, కరెంటు ఇలా ప్రతీరంగంపై ప్రభావం పడిందని అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ సెల్ఫ్ గోల్ లా మారేలా ఉందని అంటున్నారు. 2019లో చంద్రబాబు ఓటమికి సొంత ఎమ్మెల్యేల ఇసుక దోపిడీ కూడా ఒక కారణమనే సంగతి మరువరాదని గుర్తుచేస్తున్నారు.