రాజ్య సభలో టీఎంసీ దూకుడు
అంబేద్కర్ పై నిన్న లోక్ సభలో హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు అటు రాజ్యసభలోనూ ప్రకంపనలు రేపాయి. దళితుల ఐకాన్ గా చెప్పుకునే భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారంటూ హోం మంత్రి అమిత్ షాపై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాయి విపక్షాలు. బీజేపి అసలు ముసుగు తొలగిపోయిందని, దళితుల ఆరాధ్య దైవంపై అనుచితమైన కామెంట్లు చేశారంటూ టిఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ రాజ్యసభలో 187వ అధికరణం కింద ప్రివిలెజ్ నోటీస్ ఇచ్చారు. అంబేద్కర్ పేరును వాడుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని నిన్నటి లోక్ సభలో అమిత్ షా విపక్షాలనుద్దేశించి కామెంట్ చేయడంపై ఆ పక్షాలు గుర్రుగా ఉన్నాయి.
దేవుడిని తలచుకోండి పుణ్యం వస్తుంది..
అంబేద్కర్ పేరును వాడుకోవడం ఈ మధ్య కాంగ్రెస్ కి ఫ్యాషన్ అయిపోయిందని అంతకన్నా దేవుడి పేరు వంద సార్లు జపిస్తే.. స్వర్గంలో కాస్త చోటయినా దక్కేది అని అమిత్ షా ఎద్దేవా చేశారు.అంబేద్కర్ ను చరిత్ర పుటల్లో నిలవకుండా మరుగున పరిచింది మీరేనని అమిత్ షా ఆరోపించారు. ఆయనపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించింది, ఎన్నికల్లో పోటీ చేయించి ఓడగొట్టినది కూడా కాంగ్రెస్సేనని షా ఆరోపించడంతో విపక్షాలు ఒక్కసారిగా తిరగబడ్డాయి. అంబేద్కర్ కు కనీసం భారత రత్న కూడా ఇవ్వలేని పెద్ద మనసు మీదని షా ఘాటుగా రియాక్టయ్యారు.షాకు మద్దతుగా రంగంలోకి దిగిన బీజేపి నేతలు, ప్రధాని మోడీ సైతం విపక్షంపై మరింత పదునైన విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ దశలో కాంగ్రెస్ నేతలు అమిత్ షా ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తున్నారని మండి పడ్డాయి. నిన్న మొదలైన ఈ రచ్చ ఇవాళ కూడా కొనసాగింది. పార్లమెంటు ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి కూడా.