- రూ. 15 వేల కోట్ల ఆస్తులు సీజ్..
- లోక్ సభలో కేంద్రం ప్రకటన
మనదేశంలో బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడా బాబుల నుంచి దాదాపు రూ.15 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభకు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ మాల్యా కు చెందిన రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసి ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకు అందచేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని, గతంలో ఇదే రకమైన నేరాలు చేసి పారిపోయిన మేహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ మాల్యాలకు చెందిన ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ దాదాపు రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను వారు ముగ్గురి నుంచి జప్తు చేసిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రూ.1,052 కోట్లు నీరవ్ మోడీకి చెందినవి కాగా, రూ.2,565 కోట్లు మేహుల్ చోక్సీ కి చెందినవి. ఎన్ ఎస్ ఈఎల్ కేసుకు సంబంధించి రూ.17.5 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఈడీ రూ.22,280కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని, ఆర్థిక నేరగాళ్లు పారిపోయినా వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని నిర్మల తెలిపారు. మనీ లాండరింగ్ కు సంబంధించి ఇప్పటి వరకూ 900 కేసులు నమోదు చేశామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపణలకు బదులిస్తూ ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి, కేసుల పేరుతో వేధించడానికే ఈడీని ప్రయోగిస్తోందని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.