సింగూరు,మంజీరా రిజర్వాయర్లకు గోదావరి జలాలను తరలిస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా మహానగరం హైదరాబాద్ ప్రజల దాహార్తికి శాశ్వతపరిష్కారంతో పాటు సింగూరు,మంజీరా కింద సేద్యంలోకి కొత్త ఆయకట్టు తీసుకువస్తామని తెలిపారు. అదేవిదంగా నిజాంసాగర్ ను కూడా గోదావరి జలాలతో నింపుతామని ఆయన చెప్పారు.
బుధవారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌదలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్ లు,ఎత్తిపోతల పథకాలపై మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖమంత్రి దామోదర్ రాజనరసింహ ,మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ,ఆర్&ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి,ఇ.ఎన్.సి లు అనిల్ కుమార్,నాగేందర్ రావు,సి.ఇ ధర్మ తదితరులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సింగూరు ప్రాజెక్ట్ లో పూడిక తీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర జలవనరుల సంఘం రూపొందించిన విధానం ప్రకారమే పూడిక తీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. యుద్దప్రాతిపదికన పూడిక తీత పనులు చేపట్టాలని సూచించారు. పూడిక తీత ద్వారా నీటి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సింగూర్ కాలువల లైనింగ్ కు టెండర్లు ఆహ్వానించాలని, ప్రధానంగా టెండర్లు పూర్తి చేసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్న పనులు మొదలు పెట్టని బసనేశ్వర్,సంఘమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలు పెట్టాలన్నారు. పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలు సిద్ధం చేసి పాలనా పరమైన అనుమతులు తీసుకోవాలన్నారు. అన్ని పూర్తి అయితే డిసెంబర్ చివరి నాటికి శంకుస్థాపన జరుపుకోవచ్చని ఆయన సూచించారు.
పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పధకానికి సుమారు 660 కోట్లు అంచనా వేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అర్దాంతరంగా ఆగి పోయిన ప్యాకేజ్ 19 ఏ పనులు తక్షణమే పునరుద్ధరించాలన్నారు. ప్యాకేజీ 19 ఏ పునరుద్ధరణకు 600 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజ్ 17,18,19 ల పనులలో వేగవంతం చేయాలన్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో కారముంగి ఎత్తిపోతల పథకానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.