22.9 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

ఎన్నికల ముందు కోతలు..తర్వాత ఎగవేతలు…హరీష్‌ రావు ఎద్దేవా

ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు,ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు సంధించారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్ చేయడంలో ప్రభుత్వం  విఫలమైందన్నారు. సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15 వ వార్డ్ లో నిర్వహించిన వార్డ్ సభలో ( గ్రామ సభలో)  పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మాజీ మంత్రి హరీష్ రావు  కామెంట్స్:

ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం, మీ సేవలో అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్లికేషన్ పెట్టుకున్నాం అని ప్రజలు అంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్ చేయకపోవడం వల్ల, కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

13 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.  ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు,ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందని అంటున్నాడు. గాడిచర్లపల్లి చిన్న గ్రామం. ఇక్కడ రుణమాఫీ కాని రైతులే ఎక్కువగా ఉన్నారు. రేవంత్ రెడ్డి.. మీ సొంత ఊరికి పోదామ? మా గాడిచర్లపల్లికి వస్తావా చెప్పు? రుణమాఫీ ఎంతమందికయిందో ఎంతమంది కాలేదో చూపిస్తా.

ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉండడం కాదు, ఊర్లలో గ్రామసభలోకి రావాలి. పోలీస్ పహారాల మధ్య గ్రామసభలు నిర్వహించి మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 30 నాడు 2750 కోట్లకు  మహబూబ్ నగర్ లో రుణమాఫీ చెక్కు ముఖ్యమంత్రి ఇస్తే ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే.

ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రికి రైతుల కోసం ఇచ్చిన చెక్కు రాకపోతే ఇచ్చే బాధ్యత లేదా? ఈ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదు. వారిపై చిత్తశుద్ధి లేదు. మోసాల పునాదిపై ఏర్పడింది ఈ ప్రభుత్వం.  రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి.

నిన్న రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. గాడిచర్లపల్లి గ్రామసభలో రైతులు అడుగుతున్నారు… వానకాలం రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.వానకాలం, యాసంగి కలిపి..ఇచ్చిన మాట ప్రకారం 15000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ఎగవేతల రేవంత్ రెడ్డి, కోతల రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు కోతలు ఎన్నికల తర్వాత ఎగవేతలు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే యాసంగి వానకాలానికి కలిపి రైతుబంధు ఇవ్వాలి. 15000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావ్, 5000 కోట్లతో మీ ఊరికి ఆరు లైన్ల రోడ్డు వేసుకుంటున్నావు. మీ ఊరికి రోడ్ ఏసుకునేందుకు పైసలు ఉంటాయి..మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్డుకు పైసలు  ఉంటాయి కానీ రైతులకి ఇవ్వడానికి డబ్బులు ఉండవా?

రేషన్ కార్డుల కోసం గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయో తెలియదు. దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? ప్రజల డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు? అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. పదేళ్ల కింద కేసీఆర్ రేషన్ కార్డుల కోసం ఆదాయం పరిమితి పెంచారు. 60,000 ఉంటే 150000 రూపాయలు చేసిండు. 75000 ఉంటే అర్బన్ లో రెండు లక్షల 55 వేలు చేసిండు. 2014లో కేసీఆర్ పెంచితే 2024 లో కూడా అదే పరిమితితో రేషన్ కార్డు ఇవ్వడం దుర్మార్గం.

ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కడతామని హామీ ఇచ్చారు. ఏడాది పూర్తయింది ఒక్క ఇల్లయిన ప్రభుత్వం కట్టిందా? కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన ఇల్లులే తప్ప కట్టిన ఇళ్ళు లేవు.  ఎస్సీ,ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టించలేదు.

ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకునేందుకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూలీలందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు కొందరు మాత్రమే అర్హులు అనడం దుర్మార్గం. రకరకాల సాకులతో కోతలు పెట్టి కోటిమంది కూలీలు ఉంటే ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆరు పైసలు ఇచ్చి 94 పైసలు ఎగబెడుతున్నారు.

రుణమాఫీ 30 పైసలు ఇచ్చి, 70 పైసలు ఎగబెట్టారు. రైతు భరోసా వానకాలం ఎగపెట్టిరు, యాసంగి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పేదోళ్ళకు, అర్హులైన వారందరికీ ఇళ్ళు ఇవ్వాలి. ఇంచార్జ్ మంత్రుల పేరిట కార్యకర్తలకు ఇళ్లు ఇస్తే ప్రజాపోరాటం తప్పదు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రోటోకాల్ పాటించడం లేదు. గ్రామసభల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోటో పెడుతున్నారు గాని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఫోటోలు పెట్టడం లేదు.

ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏడాదికే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకుల తప్పులకు అధికారులు బలవుతున్నారు. గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. 2500 మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారు అని మహిళలు అడుగుతున్నారు. ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల రూపాయలు బాకీ పడింది. జార్ఖండ్ లో  హేమంత్ సొరెన్ గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు 2500 ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంక పెన్షన్లు పెంచిన 4000 రూపాయలు ఇస్తున్నారు.

రేవంత్ రెడ్డి..అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్? రైతు భరోసా వానకాలం, యాసంగికి కలిపి 15వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం.వ్యవసాయ కూలీలందరికీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి. పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ లకి ఇళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com