- మంత్రుల తీరుపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి
- ముఖ్యమంత్రి పై ఆరోపణలు విమర్శలు చేసిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం
- ఢిల్లీకి చేరిన ఫిర్యాదులు
- తనదైన శైలిలో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి
- పార్టీ ప్రభుత్వ బాధ్యతలు రేవంత్ రెడ్డి పైనే
- కులగణనతో అమాంతం పెరిగిన రేవంత్ ఇమేజ్
- మంత్రులకు మింగుడు పడని రేవంత్ ఇమేజ్
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పదం వన్‌మ్యాన్ షో. తెలంగాణ ప్రభుత్వం ఎలా నడుస్తోందంటే పూర్తిగా వన్ మ్యాన్ షో గా ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. అయితే పైకి వన్‌మెన్ షోగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అది ఒంటరి పోరాటమని ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన మంత్రులు ఎవ్వరూ ఆయనకి సహకరించడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, లేక ప్రభుత్వం నిర్ణయాలపై ఎటువంటి వివాదాలు చెలరేగినా అధికారికంగా వాటిపై మాట్లాడే మంత్రులే కరువయ్యారు. క్యాబినేట్ సహచరుల్లో చాలా మంది నాకెందుకు వచ్చిందిలే అన్న ధోరణిలో వ్యవహరించడంతో రేవంత్ రెడ్డే స్వయంగా రంగంలోకి ఇష్యూ క్లియర్ చేసుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.
కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నా ఇంత నిష్క్రియా పర్వంగా మంత్రులు ఇంతకు ముందెన్నడూ లేరు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా అటు పార్టీలో నాయకులు ఇటు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎవర్ యాక్టీవ్ గా ఉండే వారు. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలకు పూనుకున్నా ఆటు పార్టీ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి తీవ్ర స్ధాయిలో ప్రతి స్పందన ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మరీ రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాల తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ దాన్ని మరో దఫా నిలుపుకునే విధంగా ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన ఉండటం లేదనే అసంతృప్తి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టే విషయంలో స్వయంగా సీయం రేవంత్ రెడ్డే తెరమీదకు రావాల్సి వస్తోంది. క్యాబినేట్ లో చాలామంది మంత్రులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే వాదన మొదటి నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో మంత్రులకు, కొంత మంది సీనియర్ శాసనసభ్యులకు ఎన్ని సార్లు హితవు చెప్పినా వాళ్ళు మాత్రం పద్దతి మార్చుకోకుండా ప్రతిపక్షాలపై మాట్లాడడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డే వివిధ వేదికల మీద కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్ధితి ఉంది. ఒకరిద్దరూ మంత్రులు తప్పితే రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉండి ప్రభుత్వ వాదన బలంగా వినిపించే మంత్రుల సంఖ్య తక్కువగా ఉందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సైతం చెప్పుకోలేకపోతున్నామని పదేపదే రేవంత్ రెడ్డి అంటున్నారు. కేవలం ముఖ్యమంత్రి ఒక్కరు మాట్లాడితే సరిపోదని… మంత్రులు కూడా సహకరిస్తేనే ప్రభుత్వం సజావుగా సాగుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రభత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించకపోవడం వల్ల అవి ఎంత మంచి కార్యక్రమాలైనా ప్రజల్లోకి ప్రతిపక్షాలు వేరే విధంగా తీసుకువెళుతున్నాయనే ఆవేదన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉంది. లగచర్ల మొదలుకొని, హైడ్రా, కులగణన, మూసి ప్రక్షాళన వంటి వాటిపై ప్రతిపక్షలు చేసిన వ్యతిరేక ప్రచారం వల్ల ప్రజల్లో కూడా వీటిపై సానుకూలత వ్యక్తం కావడం లేదు. అలాగ కాకుండా ఎప్పటికప్పుడు మా వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ ప్రజలకు అసలు ప్రభుత్వ ఉద్దేశాలు వివరిస్తే ఇటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చేది కాదని సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు.
ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులు అంతా తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని… వారి వల్ల పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ప్రయోజనం చేకూరడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో పరిస్థితులు గమనిస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎవరైనా విమర్శలు చేస్తే కనీసం ఐదు మంది మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించి స్పందించేవారు.. అప్పటి విపక్ష నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు. నిజానికి ఇది సర్వసాధారణం ముఖ్యమంత్రిని ఎవరు ఏ మాట అన్నా మంత్రివర్గంలో ఉన్నవారు తీవ్రంగా స్పందించి కౌంటర్ ఇస్తారు. కానీ విచిత్రంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రిని తిట్టినా, ఎవరైనా ఆరోపణలు చేసిన మాకేం సంబంధం లేదనే రీతిలోని మౌనంగా ఉంటున్నారు. గాంధీభవన్లో మీడియా సమావేశాలు నిర్వహించడానికి కూడా కొందరు మంత్రులు ముందుకు రావడంలేదని పార్టీ నేతలు అంటున్నారు. కొందరు మంత్రులు అయితే ఇటు తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించడం లేదు సరికదా కనీసం పార్టీకి కూడా ఉపయోగపడటం లేదని సీనియర్లు ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ కు ఫిర్యాదు చేశారు. మంత్రుల సహకారం లేదని నేరుగా చెప్పడానికి ముఖ్యమంత్రి అనుచరులు అంగీకరించకపోయినా సమస్యలు ఉన్నాయని మాత్రం ఒప్పుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం విపక్షాలకు కౌంటర్ ఇస్తూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే విషయంలో ఎక్కడా వెనుకాడడం లేదని నేతలు అంటున్నారు.