23.3 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

జాతీయ రహదారులతో ఆధ్యాత్మిక క్షేత్రాల అనుసంధానం – గడ్కరీ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ప్రధానంగా భద్రాచలం, బాసర, మేడారం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఈ జాతీయ రహదారులు రవాణా మెరుగుదలకు దోహద పడతాయన్నారు. సోమవారం నితిన్‌ గడ్కరీ.. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ యోధుల పోరాటాలను కొనియాడారు. భూమి, భుక్తి కోసం వారు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని గుర్తు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన రూ. 3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ప్రధానమంత్రి సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ప్రగతికి కీలకం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచేందుకు కేంద్రం వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తోందని వివరించారు. రోడ్డు ప్రాజెక్టులలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాల నిర్మాణాలు చేపడుతున్నామని, జోజిలా పాస్ టన్నెల్ ఇందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

తెలంగాణలో సూర్యాపేట నుండి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు గడ్కరీ తెలిపారు. అలాగే, నాగ్‌పూర్ నుండి విజయవాడ వరకు కారిడార్ కూడా నిర్మించబోతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా మెరుగుదలకు దోహదపడతాయని అన్నారు. జగిత్యాల నుండి కరీంనగర్ వరకు హైవే విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.

హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. అంబర్‌పేట్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నట్టు చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని పిలుపునిచ్చారు. ఫలితంగా రవాణా ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com