గడిచిన ఐదేళ్లలో తీసుకోని కీలక నిర్ణయం ఆర్బీఐ ఇప్పుడు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఏళ్ల తర్వాత ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే 12 లక్షల వరకు పన్ను లేదని కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెబితే.. తాము ఏం తక్కువ తిన్నాం మేం కూడా చెబుతాం అన్నట్టుగా ఆర్బీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల తర్వాత తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును తగ్గించడం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా మధ్య తరగతి సామాన్య జనానికి భారీ ఉపశమనం కలిగించింది. శుక్రవారం ఉదయం జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వివరాను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటు తగ్గించింది. రెపో రేటును ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే.. 0.25 శాతం మేర రెపోరేటు తగ్గించింది. ఆర్బీఐ గవర్నర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా తన నేతృత్వంలో జరిగిన తొలి సమావేశంలోనే రెపోరేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు ఉన్న రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. రెండేళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి. 2023 మే తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. 2023 నుంచి వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును 6.50 శాతానికి పెంచారు. రెపో రేటును ఆఖరిసారిగా తగ్గించింది 2020 మే లోనే. కరోనా దెబ్బకు దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూతనోత్సాహాన్ని నింపేందుకు నాటి గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రత్యేకంగా ఆర్బీఐ సమీక్ష నిర్వహించి రెపో రేటును తగ్గించారు. కరోనా ఎఫెక్ట్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మళ్లీ పెంచాల్సి వచ్చింది. తాజాగా 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది.
ఆర్బీఐ ఐదేళ్ల తర్వాత రెపోరేటు తగ్గించడం జనానికి ఊరటనిచ్చింది. రెపో రేటు తగ్గడంతో పలు రకాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ప్రధానంగా గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా అవసరార్థులు రుణాలు తీసుకోవడం చవకగా మారనుంది. అలాగే వారి ఈఎంఐ భారం కూడా తగనుంది.