సుప్రీంకోర్టు సూటిగా ఓ ప్రశ్న వేసింది. అక్రమవలసదారులను తిరిగి వెనక్కి పంపించేందుకు మీకు ప్రత్యేకంగా ముహూర్తం ఏమైనా కావాలా? అని. ఓ వైపు అమెరికా అక్రమవలసదారులపై చర్యలు తీసుకోవడమే కాదు.. అక్కడి నుంచి నేరుగా వారిని వారి స్వదేశాలకు పంపుతోంది. మరి భారత్‌లో పరిస్థితి మాత్రం పూర్తిగా వేరేలా ఉంది. అస్సాం ప్రభుత్వానికి ఈ ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు. అక్రమ వలసదారులుగా గుర్తించిన వారిని ఎందుకు తిరిగి పంపడం లేదని నిలదీసింది.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడిన వారు పశ్చిమబెంగాల్, అస్సాంలో తిష్టవేశారు. ఇప్పటికే బంగ్లా నుంచి వచ్చినవారికి సకల సౌకర్యాలతో పాటు అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారని బెంగాల్‌లోని దీదీ సర్కార్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకే గతంలో నేషనల్ రిజిస్ట్ర్ ఆఫ్ సిటిజన్స్ ని తీసుకొచ్చి అక్రమ చొరబాటుదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది కేంద్రం. అలా గుర్తించినవారిని వెనక్కి పంపే క్రమంలో డిటెన్షన్ సెంటర్లలో పెట్టింది. అలా గుర్తించిన 63 మందిని ఎందుకు వెనక్కి పంపలేదని ప్రశ్నిస్తోంది సుప్రీంకోర్టు. ఏదైనా ప్రత్యేక ముహూర్తం కావాలా అని ప్రశ్నించింది.
డిటెన్షన్ సెంటర్‌లో ఎంత కాలం ఉంచుతారు? అని అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. అయితే వారి చిరునామాలు తెలియదన్నది ప్రభుత్వ సమాధానం. అలాగని వారిని ఉంచడానికి వీళ్లేదు. వారు ఏ దేశం నుంచి వచ్చారో తెలుసు కాబట్టి.. వారిని ఆ దేశ రాజధానికి పంపించేయండి అంటూ తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం. దీని కోసం విదేశాంగశాఖ సహాయం తీసుకోవాలని కూడా సూచించింది.
అయితే అమెరికా పంపగానే భారత్ అక్రమ వలసదారులకు స్వాగతం పలికినట్టు.. భారత్ పంపే వలసదారులకు స్వాగతం పలికేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. వారు బంగ్లాదేశ్ పౌరులు అనేందుకు సరైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే వీరిని తీసుకుంటే బంగ్లాదేశ్ ప్రజల కోపానికి కారణమవుతామన్న భయం అక్కడి ప్రభుత్వంలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.