37.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

పనామా అడవులు దాటగలిగితేనే డాలర్ డ్రీమ్స్

  • అక్రమ మార్గాల్లో అయినా వెళ్లేందుకే నిర్ణయం
  • నకిలీ ఏజెంట్లకు లక్షలు గుమ్మరింపు
  • అనేక దేశాలు నడుచుకుంటూ… కాలిబాటన పయనం
  • కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ
  • బోట్లలో రిస్కీ జర్నీ..పనామా అడవుల్లో భారీ వర్షాలు
  • పులులు, సింహాలు, పాములు,క్రూర జంతువుల మధ్య
  • బిస్కట్లు తిని బతికి నడక..
  • నడవలేక టెంట్లు వేసుకుని కూలబడ్డ అనేకులు
  • బురదలోనే నడక.. మహిళల అవస్థలు
  • మార్గ మధ్యంలోనే గుటుక్కుమనేవారెందరో
  • అయినా వదలని అమెరికా పిచ్చి

అమెరికానుంచి వెనక్కు వచ్చిన అక్రమ వలసదారులను కదిపితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.కొంపా, గోడు సర్వస్వం అమ్ముకుని ఏజెంట్ల మాయమాటలు నమ్మి దేశం దాటేసిన వారు ఇప్పుడు కట్టుబట్టలతో మళ్లీ ఇంటికే చేరడం వారిని కలచి వేస్తోంది.అమెరికా అధికారుల కంట్లో పడకుండా ఆ దేశంలో పడిపోతే అంతే చాలని ఈ అమాయక అక్రమ వలసదారులంతా లక్షలకు లక్షలు నకిలీ ఏజెంట్లకు చెల్లిస్తున్నారు. వారిని అమెరికా గడ్డపై దింపే పూచీ తమదేనని చెప్పే ఏజెంట్లు తీరా ప్రయాణం మొదలయ్యే సరికి వారికి చుక్కలు చూపిస్తున్నారు. చాలా మంది ఏజెంట్లు అమెరికా చేర్చకుండా మార్గ మధ్యంలోనే వదిలేసి చేతులెత్తేస్తున్నారని తాజాగా వెలుగు చూసిన కథనాల ద్వారా వెల్లడవుతోంది.

పనామా అడవుల్లో అక్రమ వలసదారుల టెంట్లు

మెక్సికో దేశం గుండా అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు బయల్దేరిన ఇండియన్లు మధ్యలోనే నీరసపడి అడవుల్లోనే టెంట్లలో చతికిల పడిపోతున్నారు.మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్న కుటుంబాలయితే మెక్సికోకు వెళ్లే మార్గంలోనే ఈ అడవుల్లో కూలబడిపోతున్నారు. అక్రమ వలసదారులను అమెరికా నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపుతున్న ఈ తరుణంలో ఇలా అడవుల్లో చిక్కుకుపోయిన భారతీయుల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. పనామా అడవులు అధిక వర్షపాత అడవులు. అక్కడ ఎక్కువగా వర్షం కురుస్తుంటుంది. నేలంతా బురదతోనూ, చిత్తడితోనూ నిండిపోయి ఉంటుంది.. తాజాగా బయటకు వస్తున్న వీడియోల్లో ఈ బురదలో అష్ట కష్టాలు పడుతున్న భారతీయ కుటుంబాల దీనస్థితి బయటపడింది.ఆ వీడియోల్లో బురదను తట్టుకునేందుకు వినియోగించే రబ్బర్ బూట్లు వేసుకుని మగవారు, పసిపిల్లలను ఒళ్లో కూర్చోబెట్టుకుని టెంట్లలో కూర్చున్న ఆడవారు కనిపిస్తున్నారు. మరో వీడియోలో ఈ అక్రమ వలస దారులు రైన్ కోట్లు వేసుకుని భారీ వర్షం మధ్య అడవుల్లో నడుస్తూ వెడుతున్నారు.

మధ్యమధ్యలో బ్రేక్ జర్నీలు..

పనామా అడవుల్లో నడిచే వీరంతా అక్కడనుంచి కోస్టారికా, నికారాగువా, హోండురాస్, గ్వాటెమాలలను దాటుకుని చివరగా మెక్సికోలో ప్రవేశిస్తారు. అక్కడ నుంచి మరో కంటికి తెలియకుండా అమెరికా సరిహద్దులు దాటతారు. ఈ ప్రయాణం అంతా చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. పనామా అడవులు అత్యంత ప్రమాదకర అడవులు. అక్కడ తినేందుకు తిండి దొరకదు. వేగంగా ప్రవహించే సెలయేళ్లు, క్రూర మృగాలు ఎదురు పడతాయి. కొండలు ఎక్కుతూ, గుట్టలు దాటుతూ.. బురదలో నడుస్తూ.. వర్షంలో తడుస్తూ.. తిండి లేక కడుపు మాడ్చుకుని నడవాల్సిందే. వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలి చావులు తప్పవు. మధ్యలో ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా ప్రాణాపాయం అయినా వారిని అక్కడ వదిలేసి అడుగు ముందుకు వేయాల్సిందే. పైగా బందిపోట్లు, దొంగలు, అసాంఘీక శక్తులు సంచరించే ప్రదేశం. ఆ రూట్ లో నడిచి బతికి బట్టకడితే ఆశ్చర్యమే. అయినా అమెరికాలో కాసుల వేట కోసం మన వాళ్లు అక్రమ మార్గాల్లో ప్రాణాలకు తెగించి రిస్క్ చేస్తూనే ఉన్నారు.

తనను సరైన మార్గంంలో సక్రమంగానే అమెరికా తీసుకు వెడతానని చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఆ తర్వాత వీసా ఇవ్వలేదని, అడ్డ దారిలో అమెరికాకు తీసుకెళ్లాడని జస్పాల్ సింగ్ అనే వలసదారుడు తెలిపారు. తన దగ్గర రూ.30 లక్షలు  వసూలు చేసిన ఏజెంట్ ఈ దొడ్డి దోవన తీసుకెళ్లాడని వాపోయారు.

హరిందర్ సింగ్ అనే మరో వలసదారుడిది మరో ఆవేదన. అతనిని మొదట కతార్, బ్రెజిల్‌, పెరూ, కొలంబియా, పనామా, నికారాగువా దేశాల గుండా తిప్పి మెక్సికోకు తరలించారని అక్కడనుంచి మిగిలిన వారితో కలసి అమెరికాలో ప్రవేశించినట్లు తెలిపాడు. కొండలు ఎక్కించి, అడవులంట తిప్పి, బోటు ఎక్కించి  సముద్ర ప్రయాణం కూడా చేయించారని, మధ్యలో బోటు మునిగిపోయే పరిస్థితులు తలెత్తాయని తెలిపాడు. అతికష్టం మీద ఆ ప్రయాణం సాగిందని ఎట్టకేలకు అష్ట కష్టాలు పడి అమెరికా చేరితే ఇల్లీగల్‌ ఇమ్మిగ్రంట్‌ అంటూ వెనక్కు తిప్పి పంపారని వాపోయాడు. వీసా ఇప్పిస్తానంటూ 42 లక్షలు తీసుకున్న ఏజెంట్‌ మొదట యూరప్ కి, ఆతర్వాత మెక్సికోకి తీసుకు వెళ్లి ఆపై అమెరికాకి పంపుతానని చెప్పి మోసగించాడన్నాడు. 45 రోజుల సుదీర్గ ప్రయాణంలో ఒక్కోసారి అన్నం దొరికేది కాదు. బిస్కట్లతో కడుపు నింపుకున్నామని హరీందర్ సింగ్‌ తెలిపాడు.

అయితే మరో వారంలో మోడీ అమెరికా పర్యటన ఉండగా ట్రంప్‌ ఇలా  సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. డిపోర్టీలకి నేర చరిత్ర ఉందా అన్న అంశంపై పంజాబ్ పోలీసులు,సెంట్రల్ ఇంటెలిజెన్స్ బలగాలు చెక్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com