32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఆమ్‌ ఆద్మీ ఓటమికి కారణాలెన్నో..

  • చీపురును పక్కన పెట్టిన పబ్లిక్
  • కనీసావసరాలు తీర్చడంలో అట్టర్ ఫ్లాప్
  • వెంటాడిన అవినీతి ఆరోపణలు, కేసులు
  • జైలు జీవితం.. చేజారిన నేతలు
  • వైఫల్యాలపై బీజేపి పకడ్బందీ ప్రచారం
  • కాంగ్రెస్ పొడిచిన వెన్ను పోట్లు
  • కన్‌ ఫ్యూజ్ చేసి కార్నర్ చేసిన బీజేపి

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు దేశం నడిబొడ్డును చీపురు పట్టి శుభ్రంచేస్తానన్న కేజ్రీవాల్‌ను ఊడ్చినది చాలంటూ ప్రజలు పక్కన పెట్టారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్లుగా ఆప్‌ ఒటమికి అవినీతే కారణమా? అవినీతి నిర్మూలనకు లోక్ పాల్ లాంటి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించి నిస్వార్ధ సేవకుడు అన్నా హజారే సరసన ఉద్యమం నుంచి ఆప్ రాజకీయ రూపాంతరం తీసుకున్న తర్వాత ఇవాళ ఇలా ఓటమి అంచులకు జారడం వెనక స్వీయ తప్పిదాలు చాలానే కనిపిస్తున్నాయి. సామాన్యుడినంటూనే డబ్బు సంపాదించడంలో పడిపోవడమే కేజ్రీవాల్‌ పతనానికి కారణమని వ్యాఖ్యానించారు అన్నా హజారే.

పదేళ్ల క్రితం వరకూ కేజ్రీవాల్‌ అంటే ఓ క్రేజ్.. దేశ రాజధానికి సీఎం. అవినీతిని చీపురుతో ప్రక్షాళన చేసేందుకు వచ్చిన ఓ సామాన్య కార్యకర్త… ఆమ్ ఆద్మీ…  కేజ్రీవాల్‌ మొదటి అయిదేళ్ల పాలనకు, చివరి పాలనకూ పోలికే లేదు. 12ఏళ్ల నాడు సామాన్యుని గుండె చప్పుడుగా ఉన్న కేజ్రీవాల్‌ 70 సీట్లలో 67 గెలుచుకుని కాంగ్రెస్ కు చుక్కలు చూపించాడు. ఆయన నడవడి, శైలి అన్నీ చాలా కొత్తగా, సిన్సియర్ గా కనిపించేవి. సామాన్యుడి కారయిన వేగనార్ కూడా తన కష్టార్జితమే. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. సామాన్యుడినేనన్నట్లు మెట్రో ప్రయాణాలు చేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు సరి, బేసి విధానం లాంటి వినూత్న ప్రణాళికలు అమలు చేశారు. దేశంలో ఏ పార్టీ ఇవ్వనన్ని ఉచితాలు, సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఢిల్లీ రూపాన్నే కొంత వరకూ మార్చ గలిగారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, విద్యుత్ బిల్లుల తగ్గింపు, మహిళల సంక్షేమం, ప్రాథమిక పాఠశాలలు, స్కూళ్లను సంస్కరించడం, తల్లీ, పిల్లలకు ఆరోగ్య సంక్షేమ పథకాలను అందించడం ఒకటేమిటి అన్నీ పక్కాగా అమలు చేశారు. ఆ నిక్కచ్చి, నిజాయితీ తనమే ఆయన్ను రెండోసారి గెలిపించింది. రెండోసారి కూడా ఆయన 70కి 62 సీట్లు సాధించి తమకు ఎదురే లేదని చాటారు.

వెంటాడిన అవినీతి ఆరోపణలు…

ఆ తర్వాతే బొమ్మతిరగబడింది. రెండో ఏడాది మధ్యకొచ్చేసరికి ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆమ్ ఆద్మీనని నడిరోడ్డుపై నిద్రించి నిరసన తెలిపిన కేజ్రీవాల్‌ ఆ తర్వాతే అత్యద్భుతమైన అద్దాల సౌధాన్ని నిర్మించుకున్నారు. ఇంటిని రినోవేట్‌ చేస్తున్నానని రూ.7 కోట్ల అంచనాలతో మొదలు పెట్టినా అది కాస్తా పూర్తయ్యే సరికి రూ.33 కోట్లకు పైగానే ఖర్చయ్యింది. ఇది కాగ్‌ నివేదికలు చెబుతున్న లెక్క. బీజేపి ఆరోపణలైతే రూ.80 కోట్ల పైమాటే. మోడీ చేసిన శీష్‌ మహల్ ఆరోపణలు బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. తొలి అయిదేళ్లలో పక్కాగా బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోయన కేజ్రీవాల్‌ రెండోసారి గెలిచే సరికి చతికిల బడ్డారు. దానికి కారణం ఆయన ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేకపోవడం. దీనికి తోడు లిక్కర్ పాలసీలో అవినీతి. ఢిల్లీ ప్రజలకు సరసమైన ధరలకు మద్యం సరఫరా టెండర్లను పిలవడంలో పర్సంటేజిలు తీసుకున్నారన్న ఆరోపణలు ఆయన అవినీతి పడవ ప్రయాణానికి తూట్లు పొడిచాయి. కేజ్రీవాల్‌ పై జనానికి నమ్మకం సడలుతూ వచ్చింది. నీతిమంతుడన్న ముద్ర నీటి మీద రాతలా చెరిగిపోయింది. ఇక 2024 మార్చిలో కేజ్రీవాల్‌ అరెస్టుతో ఆప్‌ పూర్తిగా కుప్పకూలింది. ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఉచితాల కోసం ఎదురు చూస్తుంటే ఆప్‌ నేతలు తమకంటిన బురదను కడుక్కోడానికే సరిపోయింది. పార్టీ చెదిరిపోయి ఎమ్మెల్యేల నమ్మకం వమ్మవుతుంటే ఆప్‌ ఆత్మరక్షణలో పడిపోయింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌, సీఎం కేజ్రీవాల్‌ ఒకరి తర్వాత ఒకరు జైలు పాలయ్యారు. ఇది ఆప్‌ కు అతిపెద్ద ఎదురు దెబ్బ. పార్టీ నిర్మాణం సడలుతున్న వేళ లిక్కర్ స్కామ్‌ నుంచి, అద్దాల మేడ ఆరోపణల నుంచి కేజ్రీవాల్‌ బయట పడలేనంతగా కూరుకుపోయారు. జైలు నుంచి పాలనకు వీలు లేదు. అతిషీని సీఎంగా చేసినా పార్టీ మనుగడే కష్టంగా మారిపోయింది.

ముంచేసిన యమున కాలుష్యం…

మరోవైపు బీజేపి పెంచిన వ్యూహాత్మక ఒత్తిడి… ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు ఒక్కక్కటిగా కత్తిరించేసింది. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ఆపేసింది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మార్పు తెస్తానంటూ పదేళ్ల క్రితం బయల్దేరిన సామాన్యుడు అవినీతి ఆరోపణల మకిలిలో, నిస్సహాయ స్థితిలో కూరుకుపోవడంతో పాటు బీజేపి మైండ్ గేమ్‌ తట్టుకోవడం కష్టమైంది. ఈ ప్రెషర్ లోనే కేజ్రీ ప్రారంభించిన ఎదురు దాడి వ్యూహం గతి తప్పింది.

కాలుష్యం తగ్గిస్తానన్న హామీని కేజ్రీవాల్‌ ఆచణలో నిలబెట్టుకోలేకపోయారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు యమునా నది నీటిని బీజేపి విషతుల్యం చేస్తోందని, విషం కలిపిందనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణ ఆయనపై బూమరాంగ్‌ ఎఫెక్ట్ పడింది.  ఢిల్లీ ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని, లక్షల్లో ఓట్లు మాయం చేశారని ఈసీపై చేసిన ఆరోపణలూ అంతే ఒక ఆరోపణ చేసినది వెంటనే అటు ఎన్నికల కమిషన్ లేదా బీజేపి ప్రభుత్వం ముప్పేట దాడి చేసి ఊపిరాడనిచ్చేవి కాదు.

కాంగ్రెస్ కాటేసింది…

ఆప్‌ ను జాతీయ స్థాయిలో విస్తరించాలన్న కలలూ కలసి రాలేదు. బీజేపిని ఎదుర్కొనడానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరమనుకుని విపక్షాలు అన్నీ కలసి వచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తే అక్కడ కాంగ్రెస్ సహకారం లేనే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల పేరుతో ఇరు పార్టీలు పొడుచుకున్న వెన్నుపోటుతో ఈసారి ఇద్దరిదీ చెరో దారీ అయ్యింది. పేరుకు ఇండియా కూటమిలో భాగస్వాములైనా రాహుల్‌, కేజ్రీవాల్‌ విమర్శల యుద్ధం తారస్థాయికి చేరుకుంది.

 ఉచితాల అమలు నిల్‌… నిధుల కొరత ఫుల్‌

ప్రకటించిన హామీలేవీ అమలు కాలేదు. ఆ ఫెయిల్యూర్ కేంద్రంపై నెట్టేద్దామనుకున్నా కుదరలేదు. ఎందుకంటే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఆప్‌ చేతిలోనే ఉన్నా కనీసావసరాలపై దృష్టి పెట్టలేదు. తాగు నీటి కనెక్షన్ల దగ్గరనుంచి, 20 లక్షల ఉద్యోగాల కల్ప వరకూ, ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా నినాదం నుంచి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పారిశుధ్యం, పరిశుభ్రత లాంటి కనీస విషయాల్లోనూ ఆప్‌ విఫలం కావడం ఢిల్లీ ఓటరును నిరాశపరిచింది. నిధుల కొరత అంటూ బీజేపిపై వైఫల్యాన్ని నెట్టేయడం ఓటర్లకు నచ్చలేదు.రాజధాని రోడ‌లు గతుకులమయం, తాగునీరు కాలుష్యం. వాయుకాలుష్యం, ఎక్కడికక్కడ చెత్త, మురిగపోయిన డ్రైనేజీలు అన్నీ అసలు ఢిల్లీలో పాలన ఉందా అన్న అనుమానాలు కలిగించాయి.

ఆరెస్సెస్ మాస్టర్ స్ట్రోక్…

ఆప్‌ ప్రభుత్వం ఫెయిల్యుర్ ను ఎన్ క్యాష్‌ చేసుకోవడంలో ఆరెస్సెస్ గ్రౌండ్‌ లెవెల్‌ లో బాగా వర్కవుట్‌ చేసింది. ఇక యమునా నది ప్రక్షాళన జోక్ లా మారిపోయింది. అసలు హామీ నెరవేర్చలేక బీజేపి హర్యానాలో విషం కలిపిందంటూ చేసిన ఆరోపణ విమర్శల బౌండరీ దాటిపోయింది. దాంతో విపక్షాలు ఆటాడుకోడం మొదలు పెట్టాయి. కేజ్రీవాల్‌ ప్రచారంలో అదో పెద్దమైనస్ పాయింట్‌.

పదునెక్కిన బీజేపి ప్రచారం…

బీజేపిపై ఢిల్లీ ప్రజలకు పెద్దగా ప్రేమాభిమానాలు లేకపోయినా ఆప్‌ మీదున్న వ్యతిరేకతను మరింత పెంచి అనుకూలంగా మార్చుకోడంలో ఆపార్టీ సక్సెస్ అయ్యింది. సుపరిపాలన, అవినీతి బ్రహ్మాస్తాలుగా పనిచేశాయి.పనిలో పనిగా ఆప్‌ అమలు చేయని కేంద్ర ప్రభుత్వ పథకాలపైనా ఓటర్లలో ప్రచారం జరిగిపోయింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేక పోయినా సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లను గెలుచుకుంటూ తమను అష్టదిగ్బంధనం చేసేస్తోందన్న నగ్నసత్యాన్ని కేజ్రీవాల్‌ గ్రహించలేకపోయారు. ఆప్‌ ఓటు బ్యాంకు అయిన మురికి వాడలు, మధ్య తరగతి కాలనీల్లో బీజపి చేసిన సోషల్ మీడియా ప్రచారం, మీమ్స్, ఎఐ టెక్నాలజీ వినియోగం ఆప్‌కు ఊహించలేనంత డ్యామేజీ చేసేశాయి. మరోవైపు హర్యానాలో కూటమిలో ఉంటూ తమను ఆప్‌ దొంగ దెబ్బ తీసిందన్న అక్కసుతో రాహల్‌ సాగించిన విమర్శలు కూడా అగ్నికి ఆజ్యం పోశాయి. ఇలా సవాలక్ష కారణాలతో కునారిల్లిన ఆప్‌ కు కీలక నేతల రాజీనామాల పరంపర ఒక సమస్యగా మారింది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, మయాంక్ గాంధీ, కుమార్ విశ్వాస్, కైలాష్ గెహ్లట్ ఇలా ఒక్కక్కరుగా జారుకున్నారు. దాంతో ఆప్ ఓటమి పాలవక తప్పలేదు. కేజ్రీవాల్‌ స్వయంకృతాపరాధాలకు తోడు బీజేపి ప్రచార వ్యూహాలు ఆప్‌ అధినేతను దెబ్బతీయడానికి దోహదపడ్డాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com