24 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ.. ఎవరంటే?

ఢిల్లీలో బీజేపీ బంపర్‌ హిట్‌ కొట్టింది. 27 యేళ్ల కల నెరవేర్చుకుంది. ఓటర్లను తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమైంది. దీంతో, రెండుసార్లు అధికారంలో కొనసాగిన ఆప్‌ను కాదని, డిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. అయితే, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ సీఎం రేసులో ఉన్నారు. పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ 2014 మేలో మొదటి సారి ఎంపీగా 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లోనూ 2019లో మరోసారి ఎంపీగా గెలిచారు పర్వేష్‌ వర్మ. అయితే, గత యేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పోటీ చేశారు. అనూహ్య రీతిలో కేజ్రీవాల్‌ను ఓడించారు.

గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన, బీజేపీ సీనియర్‌ నాయకుడు సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడే పర్వేష్‌ వర్మ. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయంగా అత్యంత ప్రభావం చూపించే కుటుంబాల్లో పర్వేష్‌ వర్మ ఒకరు. పర్వేష్‌ వర్మ మామ ఆజాద్‌ సింగ్‌ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ 1977 నవంబర్ 7వ తేదీన జన్మించారు. ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆయన చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కాలేజీలో ఉన్నతాభ్యాసం చేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేశారు పర్వేష్‌ వర్మ. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారిగా బీజేపీ టికెట్‌పై మెహ్రౌలి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ సమయంలో తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ నేత యోగానంద్‌ శాస్త్రిని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి పర్వేష్‌ వర్మ ఎంపీగా గెలిచారు. 2019లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పర్వేష్‌ వర్మ పోటీ చేయలేదు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తలపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వర్మ తన కాంగ్రెస్ ప్రత్యర్థి మహాబల్ మిశ్రాను 5,78,486 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. వర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టడమే కాకుండా ఢిల్లీలో అత్యధిక విజయ ఆధిక్యంతో గెలిచిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన వర్మ, 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని పిలిచిన తర్వాత ఎన్నికల సంఘం ఆయనపై 24 గంటల పాటు నిషేధం విధించింది. తాజాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com