32.9 C
Hyderabad
Saturday, June 13, 2026

Live Video

spot_img

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ జోరు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంపై అపోహలు షికార్లు చేస్తున్నాయంటున్నారు రియల్‌ మార్కెట్‌ రంగ నిపుణులు. ఇప్పటికీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఉన్నత స్థాయిలో ఉందని, దాని స్థిరత్వం, భవిష్యత్తు గురించి బెంగ అవసరం లేదన్నది నిపుణుల మాట. అయితే, హైడ్రా భయంతో మొదట్లో కాస్త తడబాటు నెలకొన్నా.. ఇప్పుడు తిరిగి రియల్‌ రంగం పుంజుకుందంటున్నారు. మార్కెట్‌లో ధరలు పడిపోయాయని, రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయ్యిందంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారం సత్య దూరమని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌పై  పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య, ఇతర నగరాల కంటే ఇంకా ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయంటున్నారు.

హైదరాబాద్‌లో అవుటర్‌ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు నిరంతరం స్థిరంగా ఉంటూ పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణ చూస్తే.. శేరి లింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్‌లో చదరపు గజం ధర ఎనభై వేల రూపాయలు పలుకుతోంది. భూముల ధరలు పెరుగుతున్న సమయంలో రియల్ ఎస్టేట్ రంగం తగ్గిపోయినట్టు ప్రచారం చేయడం సరికాదంటున్నారు. అయితే, అంతర్జాతీయ పరిణామాలు కొంతమేర ప్రభావం చూపించినా, ఈ ప్రభావం ఎక్కువగా లేదంటున్నారు.

అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి  ట్రంప్ ఎన్నికయిన తర్వాత, ట్రంప్‌ నిర్ణయాలు భారతీయ కుటుంబాలపై ప్రభావం చూపించినప్పటికీ, ధరలు పూర్తిగా తగ్గలేదంటున్నారు. అదే విధంగా, ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం, ఎకరానికి ధర రూ.50 లక్షల నుండి కోటి రూపాయల వరకూ ఆ ప్రాంతంలో భూముల ధరలు పలుకుతున్నాయి.

ఇతర నగరాలలో లేని పరిస్థితులు.. హైదరాబాద్‌లో పెట్టుబడుల పెరుగుదలకు కారణమవుతున్నాయంటున్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ జామ్స్, భూగర్భజలాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ముంపు, వంటి వాటి కారణంగా, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారిందంటున్నారు.

మరోవైపు.. ప్రారంభంలో హైడ్రా కొంత మందిని ఇబ్బంది పెట్టినప్పటికీ, న్యాయపరమైన విచారణతో రియల్ ఎస్టేట్ రంగంలో నెమ్మదిగా తిరిగి పెట్టుబడులు పెరిగాయని రియల్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం భూముల విలువ పెరుగుతుందని ప్రకటించిన తర్వాత, గత కొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కూడా తిరిగి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని తెలుస్తోంది. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగంలో స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com