మధ్య మయన్మార్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదయ్యింది. అత్యంత శక్తివంతమైనదిగా చెప్పడుతున్న ఈ మయన్మార్ భూకంపం ఫలితంగా బ్యాంకాక్, థాయ్‌లాండ్ అంతటా భూమిలో విపరీతమైన ప్రకంపనలు వచ్చాయి. మయన్మార్ మధ్య ప్రాంతంలో భూమి లోపల 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం మయన్మార్‌లోని మోనివాకు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూప్రకంపనల కారణంగా బ్యాంకాక్ నగరంలో పలు ఎత్తైన భవనాలు ఊగిపోయాయి. నివాసితులు భయాందోళనలతో వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అధికారులు స్కైస్కేపర్స్ లో ఉన్న పౌరులను ఖాళీ చేయించారు. భూకంపానికి ఎత్తైన అపార్ట్‌మెంట్లు, హోళ్ళు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ప్రకంపనల కారణంగా ఎత్తైన భవనాలపైన ఉన్న స్విమ్మిగ్ పూల్స్ నుంచి నీరు కిందకి కారుతూ కనిపించింది. అయితే బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత భారీగానే ఉన్నప్పటికీ భవనాలు కూలిపోవడం, ప్రాణనష్టం వంటి వివరాలు వెల్లడికాలేదు. అయితే భూకంపం కారణంగా ఒక ఎత్తైన భవనం కూలిపోతున్న దృశ్యాలు మాత్రం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాగే భూకంప కేంద్రమైన మయన్మార్‌లో పరిస్ధితిపై కూడా ఇంత వరకూ ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.