- బీద, కృష్ణయ్యలు కొనసాగింపు
- నాగబాబుకు మంత్రి పదవి
తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే ఉన్న మూడు స్థానాలో రెండు స్ధానాలకు టీడీపీ అభ్యర్ధులను ఎంపిక చెయ్యగా మరో స్థానాన్ని భాగస్వామ్య పక్షమైన బీజేపీకి కేటాయించింది. టీడీపీ తరపు నుంచి ఇటీవలే వైఎస్సార్సీపీ పార్టీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావును ఎంపిక చెయ్యగా రెండో స్ధానానికి సనా సతీష్ అనే వ్యాపారవేత్తను ఎంపిక చేశారు. ఇక బీజేపీకి కేటాయించిన మూడో స్థానాన్ని మస్తాన్ రావులాగే వైసీపీ తరపు వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్యను తిరిగి నామినేట్ చేశారు. కృష్ణయ్య పేరును సోమవారం ఉదయమే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ప్రకటించింది. వైఎస్సార్సీపీ తపున రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు రాజీనామాలు చేస్తే వారిలో బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలను ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి రాజ్యసభకు ఎంపిక చేశారు. మోపిదేవి స్ధానంలో సానా సతీష్ ను ఎంపిక చేశారు.
కేబినేట్ లోకి నాగబాబు
ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్ధానాల్లో ఒక దాని నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబును ఎంపిక చేస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే సానా సతీష్ కు ఆ స్ధానం కేటాయించడంతో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నామని చంద్రబాబు రాజ్యసభ సభ్యుల జాబితాలోనే ప్రకటించడం విశేషం. ఇప్పటికే జనసేనకు కేటాయించిన మూడు మంత్రి పదవుల్లో ఒకాదాన్ని కమ్మ సామాజికవర్గానికి కేటాయించగా మిగిలిన రెండు స్థానాలను కాపు సామాజికవర్గంతో భర్తీ చేశారు. తాజాగా నాగబాబు కూడా కాపు సామాజికవర్గానికే చెందిన వ్యక్తి కావడంతో జనసేన తరపు నుంచి బీసీ, ఎస్సీల ప్రాతినిధ్యం ఏపీ మంత్రిమండలిలో లేకుండా పోయింది. అయితే సామాజిక సమతుల్యతను తక్కెడతో తూచి పదవులు కేటాయించే చంద్రబాబు ఈ విషయాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.