కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. 1999-2004 మధ్య కర్ణాటక సీఎంగా ఆయన పని చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఎస్‌ఎం కృష్ణ పనిచేశారు. 2018లో ఎస్.ఎం.కృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే అనారోగ్య కారణంగా ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బెంగళూరు నగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలోనే పలు అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు బెంగుళూరు నగరంలో స్ధాపించబడ్డాయి. ఎస్.ఎం.కృష్ణ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.