పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల సాధన కోసం ఎన్నో పోారాటాలు చేయాల్సి వచ్చిందని ఉప అన్నారు. ఇందుకోసం ప్రస్తుత సిఎం రేవంత్ పాదయాత్ర చేయగా… జిల్లాల వారిగా కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేశారన్నారు. సచివాలయంలో ఈరోజు(సోమవారం) జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పచెప్పితే… తెలంగాణ ప్రజల కోసం ఏమీ చేయకుండా.. ప్రజలను బందీచేసి అవమానపరుస్తుంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశారు.
ప్రజలు ఆశీర్వదించటంతోనే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, భావ స్వాతంత్ర కాంక్ష కలిగిన వారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. మహిళలను మహాలక్ష్ములుగా గుర్తించి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మహిళా సంఘాలకు ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇచ్చేందుకు యోచిస్తున్నామన్నారు.
బీ.ఆర్.ఎస్ 64 వేల కోట్ల అప్పుల భారం మోపితే… దానికి అసలు, వడ్డీ కడుతున్నామన్నారు. పేదలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఎన్నికల హామీ నిబెట్టుకున్నామన్నారు. వ్యవసాయదారుల కోసం ఉచిత విద్యుత్ కు 12 వేల కోట్ల రూపాయలు డిస్కమ్ లకు చెల్లించామని వెల్లడించారు.
ఆర్థిక ఒత్తిడులు ఉన్నా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 21 వేల కోట్ల రైతు రుణ మాఫీ కింద మొదటి ఏడాది నేరుగా రైతుల అకౌంట్లోకి వేశామని చెప్పారు. రైతుల భీమా కట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకువస్తే… ఆర్థిక క్రమశిక్షణతో ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని వివరించారు.
దావోస్ మీటింగ్ కు వెళ్లిన సిఎం అక్కడ వ్యాపార వేత్తలతో సమావేశమై 36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని తెలిపారు. ఫోర్త్ సిటీ ఏర్పాటు, స్కిల్, స్పోర్ట్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. గురుకులాలకు వెళ్లి బోజనం సరిగ్గా పెట్టలేదని కొందరు గగ్గోలు చేస్తూ… ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 40 శాతం డైట్ బిల్లు పెంచిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిది అన్నారు. పదేళ్లు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు.
గత ప్రభుత్వంలో 72 కోట్లు మాత్రమే నిధులు కేటాయిస్తే…తెలంగాణ విద్యార్థులు మేటిగా ఉండాలని ఈ ఒక్క ఏడాదే 5 వేల కోట్లతో సమీక్రత గురుకులాలు నిర్మిస్తున్నామని చెప్పారు.
సకల జనుల సమ్మెతో వచ్చిన స్వరాష్ట్రం తెలంగాణ సమాజానికి ప్రతీకగా… మన అమ్మ, నానమ్మ ప్రతిరూపంగా ప్రతిష్టించుకోబోతున్నామన్నారు. విగ్రహంలో మేము ఏదీ మార్చలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రతిష్టించలేదని… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకోవడం సంతోషకరమన్నారు.
గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా ప్రతిష్టించలేదని విమర్శించారు. కోట్లాది ప్రజల తల్లిగా.. పోరాటానికి, ప్రగతి శీల భావాలకు ప్రతీకగా ఉండాలని అన్ని పట్టణాలు, నగరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించబోతున్నామన్నారు. బహుజనుల పోరాాటాన్ని గుర్తు చేసే విధంగా విగ్రహ రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణ పోరాటానికి ప్రతీకగా పీఠంలో పిడికిలి ఏర్పాటు చేశామన్నారు.
సిఎం, మంత్రిమండలి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ఠాపన ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. బాబా సాహేబ్ అంబేద్కర్ సచివాలయం దగ్గర ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నామని… అందరికీ శుభాకాంక్షలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.