తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ స్కీమ్ కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన లబ్ది దారులను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల మేరకు కేటాయించిన లక్ష్యాల ప్రకారం కలెక్టర్లు.. మున్సిపాలిటీలు, మండలాల్లో సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేస్తారని సర్కారు తెలిపింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కీలక అడుగు పడింది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ (https://tgobmms.cgg.gov.in/) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వచ్చే నెల ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి మే 20 వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావం రోజున జూన్ 2వ తేదీ నుంచి మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేస్తారు. ఈ పథకం కింద ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
రాజీవ్ యువ వికాసం ఫథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే వాళ్ల.. అర్హతలు, వయో పరిమితి, ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. రూ.50 వేల లోపు యూనిట్‌కు 100 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మిగతా యూనిట్లకు కూడా 70 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ప్రకటించింది.రాజీవ్ యువ వికాసం పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఎంపికైన లబ్ది దారుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించి ఉండకూడదు. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి. రేషన్‌కార్డు లేకుంటే మీ-సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ట్రాన్స్‌పోర్టు విభాగానికి చెందినవాళ్లు అయితే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అదే వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు అయితే సదరు సర్టిఫికెట్ సమర్పించాలి. వ్యవసాయేతర పథకానికి జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ, దాని ఆధారిత పథకాలకు 21-60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్ల సభ్యులు, ఈ బీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వారి వయసు 21 నుంచి 55 ఏళ్లు ఉండాలి. రాయితీలు యూనిట్ విలువను బట్టి మారుతాయి. రాయితీ పోగా మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా లబ్దిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా అనేది ఉండదు. యూనిట్ విలువ రూ.50 వేలలోపు ఉంటే ప్రభుత్వమే 100 శాతం రాయితీ ఇస్తుంది. అదే రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు అయితే, 90 శాతం రాయితీ, రూ.1,00,001-రూ.2లక్షలకు యూనిట్లకు 80 శాతం రాయితీ ఇవ్వనుంది. ఇక రూ.2 లక్షలపైన విలువ వాటికి 70 శాతం రాయితీ లభిస్తుంది.