25.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

కోకాపేట @ ఎకరా 100 కోట్లు

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ రంగం మందగించిందని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే… మరోపక్క కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓ కవి చెప్పినట్లు “హైదరాబాద్ నేలకు విలువ.. కుంచములతో బంగారం కొలువ” అన్న వాక్కు ఇప్పుడు అక్షరాల నిజం అవుతోంది. భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూముల విలువ బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలో భూముల ధరలకు సామాన్యుడు అందుకోలేనంత రెక్కలు వచ్చి ఎగురుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నది మాత్రం వాస్తవం. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపనల కారణంగా భాగ్యనగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నగరం హారిజాంటల్‌గా పెరగడానికి బహుసా దేశంలో ఏ మెట్రో నగరానికి లేనంత వెసులుబాటు హైదరాబాద్‌ సొంతం.

ఈ కారణాల వల్ల భాగ్యనగరంలో భూములు బంగారం అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఔటర్‌ రింగ్ రోడ్డును ఆనుకోని ఉన్న కోకాపేట, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్ రాంగూడ, నార్సింగి ప్రాంతాలు శర వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ పరిస్థితులు చూస్తే.. మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా.. లేక దేశం దాటి వచ్చామా అనే అనుభూతి కలగుతుంది. వెస్టర్న్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ఉపాధికి కేంద్ర బిందువుగా మారాయి. ఆకాశాన్ని తాకే భవనాలు, ప్రముఖ మల్టీ నేషన్‌ కంపెనీలతో ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. వ్యాపారులు, విదేశీ కంపెనీలు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శివారు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భూముల ధరలు పెరిగాయి.

ముఖ్యంగా కోకాపేటలో భూముల ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఈ ప్రాంతం హైదరాబాద్ నగరంలో ఒక ప్రధానమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు కోకాపేటకు మంచి రోడ్డు మార్గాలు ఉండటం కూడా ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా చెబుతారు. కోకాపేట ప్రాంతం హైదరాబాద్ ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ప్రభుత్వం కూడా కోకాపేట అభివృద్ధికి కృషి చేస్తోంది. దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు, సంపన్నులు, కంపెనీల నిర్వాహకులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క ఎకరం ధర రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ధర పలుకుతోంది.

ఇక హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు కూడా భూముల ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఫోర్త్‌ సిటీ నార్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. దీంతో ఈ ట్రిపుల్‌ ఆర్‌ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇంటర్ఛేంజ్‌ల దగ్గర భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ప్లాట్, విల్లా.. ఇలా విభజించి భూములను అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే.. ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్ వెళ్ళే ప్రాంతాల్లో ఎకరానికి కోటి రూపాయల నుంచి రూ.2 కోట్ల వరకు ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఏ రకంగా చూసుకున్న హైదరాబాద్‌ లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొంత విరామం వచ్చి ఉండవచ్చు కానీ ఎప్పటికీ హైదరాబాద్‌ నగర ప్రధాన ఆదాయ వనరు రియల్‌ ఎస్టేట్‌ రంగమే అంటున్నారు ఆ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com