- కిషన్ రెడ్డి పై రాజసింగ్ అసంతృప్తి
- ఎమ్మెల్సీ అభ్యర్థిపై హాట్ కామెంట్స్
- కిషన్ రెడ్డి టార్గెట్ గా తరచు విమర్శలు
- రాజసింగ్ పై చర్యలు తీసుకోవాలంటున్న కిషన్ రెడ్డి వర్గ నేతలు
- హై కమాండ్ దృష్టికి రాజా సింగ్ వ్యవహారం
రాజ సింగ్ వివాదాలకు కొత్తెం కాదు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా హైదరాబాదులో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే వ్యక్తి. బీజేపీకి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే గా ఉన్న రాజసింగ్ ఇతర పార్టీల కన్నా సొంత పార్టీ నిర్ణయాలపైనే ఈమధ్య విభేదిస్తున్నారు. హిందుత్వవాదిగా దేశవ్యాప్తంగా రాజ సింగ్ కు గుర్తింపు ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు.. బిజెపి కూడా కొంతకాలం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.. తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకుంది.
ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవల కాలంలో ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు అవకాశం లభించిన టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో కొందరు బిజెపి ముఖ్యులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నారని ఇలాంటి వాళ్ల వల్ల పార్టీ ఎప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాదని ఆయన బహిరంగ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ఎన్నిక విషయంలో కూడా కిషన్ రెడ్డి తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని రాజ సింగ్ గతంలో విమర్శించారు.
ఇప్పుడు తాజాగా మరో సారి పార్టీ నిర్ణయం పై రాజసింగ్అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గౌతం రావుకు టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇన్ డైరెక్ట్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాజసింగ్ విమర్శలు చేశారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకుల కే వస్తాయి… మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సీనియర్లు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మీకు గులాం గిరి చేసేవారికే పోస్టులు టికెట్లు ఇస్తారా… మిగతావాళ్లు మీకు గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్లని పక్కన పెడుతున్నారా అని రాజాసింగ్ ఘాటుగా విమర్శించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ పై యాక్షన్ తీసుకోవాలని బిజెపిలో కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ హై కమాండ్ నిర్ణయాన్ని కూడా ధిక్కరించే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఇలా చూస్తూ ఊరుకుంటే రేపు పార్టీకి నష్టం జరుగుతుందని వాళ్లు అంటున్నారు. అయితే బిజెపిలో రాజాసింగ్ ని సమర్థించే వర్గం కూడా ఉంది. కొన్ని విషయాల్లో ఆయన ఎక్కువగా స్పందిస్తున్నప్పటికీ ఆయన చెప్పే కొన్ని అంశాల్లో వాస్తవాలు ఉన్నాయని వారు అంటున్నారు. మొత్తానికి రాజసింగ్ ఎపిసోడ్ బిజెపికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.