అత్యున్నతమైన మన భారతదేశ రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలన్నది బీజేపీ మనోగతమని పరోక్షంగా విమర్శించారు లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ తరచూ ఇదే చెప్పేవారని, రాజ్యాంగంలో భారతీయతే లేదనేవారని రాహుల్‌గాంధీ గుర్తుచేశారు. వి.డి.సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తే మోదీ రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీ సర్వోన్నత నేతను, ఆత్మబంధువును అవహేళన చేసినట్లు అనిపించడం లేదా? అని బీజేపీని ఉద్దేశించి రాహుల్ చురకలంటించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మనుస్మృతికి మద్దతుదారులని, దేశం మాత్రం రాజ్యాంగంపైనే నడుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన రెండ్రోజుల ప్రత్యేక చర్చ శనివారం ముగిసింది. ఈ చర్చ సందర్భంగా విపక్షనేత రాహుల్ మాట్లాడుతూ బీజేపీపై దుమ్మెత్తి పోశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉంటుందన్నారు.
మహాభారతంలో ఏకలవ్యుడి బొటనవేలిని ద్రోణుడు కోయించినట్లే పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీల లాభం కోసం చిన్న వ్యాపారి వేలిని బీజేపీ కోయిస్తోందన్నారు. అగ్నివీర్, ప్రశ్నపత్రాల లీకుల ద్వారా యువకుల బొటనవేలిని, మద్దతుధర కోసం ఉద్యమిస్తున్నందుకు రైతుల బొటనవేలిని కోసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుంటే రాజకీయ సమానత్వం ఉండదని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అన్నిరకాల వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. మనుస్మృతిలాంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తోందన్న రాహుల్‌గాంధీ.. బీజేపీ మాత్రం రోజులో 24 గంటలూ దానిపై దాడి చేస్తూనే ఉందని రాహుల్ తీవ్రస్థాయిలో ఆరోపించారు.