కాంగ్రెస్‌పార్టీ దేశ రాజ్యాంగానికి అధికారంలో ఉన్నన్నాళ్లూ తూట్లు పొడిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన రెండు రోజుల ప్రత్యేకచర్చ తర్వాత ప్రధాని సమాధానం ఇచ్చారు. నరేంద్రమోదీ ప్రసంగం దాదాపు పది నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులను మోదీ దునుమాడారు. ప్రధానులుగా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. దేశ భిన్నత్వంలో విషబీజాలు నాటారని ఆక్షేపించారు. ప్రతి దశలోనూ ఆ కుటుంబం రాజ్యాంగాన్ని సవాల్ చేసిందని మండిపడ్డారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడానికి తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగ సవరణ చేయించారని, ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించినందుకు దానిని ధిక్కరించేలా ఆమె ఏకంగా అత్యయిక పరిస్థితినే విధించారని అప్పటి పరిస్థితులపై గళమెత్తారు. గొంతునొక్కి, రాజ్యాంగాన్ని ఛిద్రం చేశారని, వారి తర్వాతి తరం కూడా ఇదే విధమైన ఆటలాడుతోందంటూ మోదీ విరుచుకుపడ్డారు. ఇప్పటి తరం అంటే.. రాహుల్, ప్రియాంకలను పరోక్షంగా ఉద్దేశించి విమర్శలు చేశారు ప్రధాని మోదీ.
ఇక, మన రాజ్యాంగం మహోన్నతమైనదన్న మోదీ.. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన తాము ఇప్పుడీ స్థానాల్లో ఉన్నామంటే దానికి రాజ్యాంగ బలమే కారణమన్నారు. మన దేశ రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఇవి దేశం గర్వపడే క్షణాలని భావోద్వేగానికి గురయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వార్థపరులవల్ల అనేక కష్టాలు పడ్డామని, బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే, రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు అండగా నిలిచారని మోదీ కొనియాడారు. 1947 నుంచి 1952 వరకు మనకు ఎన్నికైన ప్రభుత్వం లేదన్న మోదీ.. ఆ సమయంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు ఓ కుటుంబం అనేక విధాలుగా ప్రయత్నించిందన్నారు. అడ్డొస్తే రాజ్యాంగాన్ని సవరించాలంటూ సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారని, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి 75 సవరణలు చేశారని మోదీ ఆక్షేపించారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారని, ఓటుబ్యాంకు కోసం అనేక కుట్రలు పన్నారని మండిపడ్డారు. అహంకార ధోరణితో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా క్యాబినెట్ నిర్ణయాన్నే చించిపారేశారని, ఆయన తల్లి అయితే ప్రధాని కంటే పైన ఉండేలా రాజ్యాంగేతర పదవి సృష్టించుకున్నారని రాహుల్, సోనియాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. గరీబీ హటావో అని ఇందిర ఇచ్చిన నినాదంలో చిత్తశుద్ధి లేదన్న ప్రధాని.. పేదరికం అంటే ఏమిటో వాళ్లకు తెలిస్తే కదా అని ఎద్దేవా చేశారు. బడుగు వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగుతాయని, మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు ఉండబోవని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంచేశారు. మత రిజర్వేషన్లను రాజ్యాంగ పరిషత్ వ్యతిరేకించినా కాంగ్రెస్ మాత్రం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇప్పుడు అలాంటి హామీలు ఇస్తోందని ఆరోపించారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని, పాలనలో ఆశ్రిత పక్షపాతానికి కాకుండా ప్రతిభకు పెద్దపీట వేయాలని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మొత్తం 11 సంకల్పాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించారు.