తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చిన నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ తల్లిపై పై ప్రేమ లేదు కాబట్టే సీయం రేవంత్ రెడ్డి రూపం మార్చారని కవిత విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుందని ఆమె ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంటే ప్రతిఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని కవిత ఆరోపించారు. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకి ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డని గుర్తు చేశారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామని ప్రకటించారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు కవిత. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు.