సొంత పార్టీపైనే రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.
గుజరాత్ లో కొందరు బిజెపితో కలిసి పనిచేస్తున్నారని ఆరోపణ.
ప్రజలను పార్టీని మరిచి బిజెపితో స్నేహంగా ఉంటున్నారని వ్యాఖ్య.
గుజరాత్లో ప్రజలు మార్పు కోరుకుంటున్న స్థానిక నేతలు స్పందించడం లేదు.
ఇక ఉపేక్షించం కఠినంగా వ్యవహరిస్తాం
కాంగ్రెస్ అగ్రనేత రాహూల్‌గాంధీ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు గుజరాత్లో బిజెపితో కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు… శనివారం గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీజేపీతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు.
గుజరాత్ కాంగ్రెస్ లో ప్రస్తుతం రెండు రకాలైన నాయకులు ఉన్నారని.. ఒకరు పార్టీ కోసం ప్రజల కోసం పని చేస్తుంటే.. మరికొందరు పార్టీని ప్రజల్ని పక్కనపెట్టి బిజెపి కోసం పని చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలు గుజరాత్ లో మార్పు కోరుకుంటున్నా స్థానిక కాంగ్రెస్ నాయకులు వారికి భరోసా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల తర్వాత మొదటిసారిగా గుజరాత్ వెళ్లిన రాహుల్ గాంధీ సొంత పార్టీ నేతల పైనే విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా పార్టీలో నేతల తీరుపై ఆసక్తి కలిగించే కథ చెప్పారు. రెండు రకాల గుర్రాలు ఉంటాయని… ఒక గుర్రం రేస్ లో ముందుంటుందని… మరో గుర్రం కేవలం పెళ్లిళ్లకు మాత్రమే పనికొస్తుందని… అయితే రేసు గుర్రాలనుతీసుకెళ్లి పెళ్లి గుర్రాలుగా మార్చారని… పెళ్లి గుర్రాలను రేసు గుర్రాలుగా వాడితే ప్రయోజనం ఉండదన్నారు.
రాహూల్‌గాంధీ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. గుజరాత్ తరహాలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు ఆ విధంగానే ఉంటారని, రాహూల్ వ్యాఖ్యల్లో తప్పులేదని హస్తం సీనియర్ నేతలు సమర్థించుకుంటున్నారు.