కరీంనగర్‌లో అక్రమార్కుల ఆటకట్టించిన పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతికి సహచర అధికారులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. కాలేజీ విద్యార్థుల మాదిరి సహచర పోలీసు అధికారులు డాన్సులు చేసి హుషారెత్తించారు. హోదాతో సంబంధం లేకుండా సహచరులతో స్నేహంగా ఉండే మహంతికి బదిలీ అయిందని అధికారులు భావోద్వేగానికి లోనయ్యారు.
శాసనసభ ఎన్నికల సమయంలో కరీంనగర్ సీపిగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ మహంతి… ఆ తర్వాత కూడా కొనసాగటంతో కమిషనరేట్ పరిధిలో చాలా మార్పులు వచ్చాయి. భూ కబ్జారాయుళ్లు, పోర్జరీ డాక్యుమెంట్లతో సామాన్యుల స్థలాలు, ఇళ్లు కబ్జా చేసే కేటుగాళ్ల ఆటపట్టించారు. రాజకీయ వర్గాల నుంచి ఎన్ని సిఫారసు లెటర్లు వచ్చినా ఖాతరు చేయకుండా సిఐలకు పోస్టింగులు ఇచ్చి పోలీసు సింగంగా పేరు తెచ్చుకున్నారు.
ముక్కుసూటిగా వ్యవహరించే మహంతి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కొందరు అక్రమార్కులైతే దేశం విడిచి విదేశాల్లోనే ఉండిపోయేలా పోలీసు పవర్ చూపించారని సామాన్యులు కొనియాడుతున్నారు.
శాంతిభద్రతల వ్యవహారాల్లో నిక్కచ్చిగా వ్యవహరించి ప్రజల మనసు చురగొన్నారు. అభిషేక్ మహంతికి బదిలీ అయిందంటే చాలా ఏళ్ల తర్వాత నగర ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు.
రాష్ట్ర పునర్విభజన సమయంలో అభిషేక్ మహంతిని కేంద్రం ఏపీకి కేటాయించింది. తెలంగాణ కేడర్‌కి కేటాయించాలని ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన పరిపాలన ట్రిబ్యునల్ అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించింది. అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణకు క్యాట్ ఆదేశాలిచ్చింది. అయినా అప్పటి ప్రభుత్వం అంత తొందరగా పోస్టింగ్ ఇవ్వలేదు.
తాజాగా కేంద్రం తిరిగి మహంతిని ఏపి క్యాడర్‌కు కేటాయించింది. కేంద్రం ఆదేశాలతో ప్రభుత్వం తక్షణమే రిలీవ్ చేసింది. అభిషేక్ మహంతి కరీంనగర్ సిపిగా చేసింది స్వల్ప కాలమే కార్యచరణలో తనదైన ముద్ర వేశారు.
అభిషేక్ మహంతి కుటుంబమే సింగం కుటుంబం. తండ్రి ఏకె మహంతి హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా చేసి ఎంఐఎం అగ్ర నేతల అక్రమాలను అడ్డుకుని వారికి ముచ్చెమటలు పట్టించారు. అభిషేక్ మహంతి సోదరుడు అవినాష్ మహంతి సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా డ్రగ్స్ దందాతో ప్రమేయం ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. తండ్రికి తగిన కుమారులుగా ఇద్దరు అధికారులు పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చాయంటే మహంతి పోలీసు కుటుంబాన్ని గుర్తు చేసుకోవల్సిందే.