37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సైలెంట్‌గా సవారీ చేస్తోన్న కాషాయ దళం

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యలోకి బీజేపీ వచ్చి చేరింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ ఫైట్‌ రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ సైలెంట్‌గా వచ్చి మధ్యలో చేరుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ పార్టీగానే పోరు నడిచింది. అయితే, పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటినుంచి సీన్‌ మారిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోగా.. కాంగ్రెస్‌కు సమానంగా బీజేపీ ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇక, మొన్నటికి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైలెంట్‌ విక్టరీ నమోదు చేసుకుంది. భవిష్యత్తులో తెలంగాణలో తమకు తిరుగు ఉండదన్న సందేశాన్ని మిగతా రెండు ప్రధాన పార్టీలకు ఇచ్చింది కాషాయ పార్టీ. గత నెలలో తెలంగాణలో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. వీటిలో ఉత్తర తెలంగాణ పరిధిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను అనూహ్యంగా బీజేపీ గెలుచుకుంది.ఒక గ్రాడ్యుయేట్‌, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా బీజేపీ జాతీయ నాయకత్వానికి.. తెలంగాణపై మరిన్ని ఆశలు పెంచుకునేలా చేసింది. ఈ విజయంతో జోష్‌ మీదున్న కమలం దళాలు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యేడాది గడిచింది. అనేక సంక్షేమ పథకాలను కొత్తగా తీసుకువచ్చామని. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయని రీతిలో పాలన సాగిస్తున్నామంటూ మంత్రులు, నాయకులు చెబుతూ వస్తున్నారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. టీచర్ స్థానాలను పక్కనపెడితే గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. పైగా కరీంనగర్‌లో జీవన్‌ రెడ్డి పదవీ కాలం ముగియడంతో జరిగిన ఎన్నిక కావడంతో.. ఆ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. కానీ, ఎన్నికల రిజల్ట్‌ బోల్తా కొట్టింది. ఆ ఒక్కస్థానం మీదే దృష్టి సారించి.. మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయినా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గెలవలేదు. సిట్టింగ్‌ సీటు బీజేపీ వశమైంది. ఈ పరిణామంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది.

తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నా.. పట్టభద్రులు మాత్రం మరోలా తీర్పు ఇవ్వడం చర్చను లేవనెత్తింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని, హామీ ఇవ్వని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెబుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడం ఆ పార్టీ నేతలు సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

కీలకమైన స్థానిక సంస్థల సమయంలో వచ్చిన ఈ ఫలితాలు ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడనీయడం లేదు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావటాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకోవాల్సి ఉందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబతున్నారు.

వాస్తవానికి ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు లాంటింది. పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్‌ఎస్‌కు తెలంగాణనే అండగా ఉంటూ వచ్చింది. దక్షిణ తెలంగాణలో దాదాపు బీఆర్‌ఎస్‌కు స్పేస్‌ చాలా తక్కువ. కానీ, కొంత కాలంగా ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పట్టు కోల్పోతుంది. ఆ పార్టీకి కీలకమైన కరీంనగర్‌ పార్లమెంటు స్థానాన్ని వరుసగా రెండు సార్లు జార విడుచుకోవడం బీఆర్‌ఎస్‌ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇప్పటికే ఉత్తర తెలంగాణ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆరు ఎంపీ సీట్లు, ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఇద్దరు కేంద్రమంత్రులున్నారు. తాజాగా రెండు ఎమ్మెల్సీ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తెలంగాణలో రోజురోజుకూ బలపడుతున్నామనే సంకేతాలను బీజేపీ చేతల్లో చూపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాపకింద నీరులా బీజేపీ విస్తరిస్తోంది. మరోవైపు.. పార్టీకి రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడిని రేపో, మాపో నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ క్రమంగా తెలంగాణలో పట్టు పెంచుకోవడం ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి జోష్‌ నింపుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో, జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో వస్తున్న ఫలితాలతో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com