తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అయితే,ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ.. ఇద్దరిని పోటీకి దించడానికి బీఆర్‌ఎస్ సమాలోచనలు చేస్తోంది. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఈమేరకు ఎర్రవెల్లిలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలంటే.. వాస్తవానికి ఉన్న బలం కన్నా మరో స్థానంలో అదనంగా బరిలోకి దించాలని డిసైడ్ అయ్యిందట.
వాస్తవానికి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే.. ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక పోస్టు బీఆర్‌ఎస్‌కు దక్కుతుంది. మిగతా నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తాయి. అయితే,
అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు కేఈసార్ ఈ వ్యూహం అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేవాళ్లు పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో ప్రతిపాదన ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరిని ప్రతిపాదించ గలిగేంత మంది సభ్యులున్నారు. అందుకే ఇద్దరితో నామినేషన్ వేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో 21 మంది సభ్యులుంటే ఒక స్థానం గెలుచుకునే వీలుంటుంది. దీనిని బట్టి చూస్తే.. బీఆర్ఎస్ పార్టీకి సాంకేతికంగా ఒక ఎమ్మెల్సీ పోస్టు మాత్రమే దక్కే వీలుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అయినా, కేసీఆర్ ఇద్దరిని గెలిపించుకునే బలం లేకపోయినప్పటికీ పోటీలో మాత్రం దించాలనుకుంటున్నారు.
ఈ వ్యూహంతోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఒక ఎమ్మెల్సీ పదవికి పోటీలో సత్యవతి రాథోడ్ పేరు ఖరారయిందని అంటున్నారు. సత్యవతి రాథోడ్‌తో పాటు రెండో స్థానానికి పోటీ చేయాల్సిన వాళ్లలో దాసోజు శ్రావణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కే మొగ్గు చూపేలా కనిపిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఏ ఇద్దరికి నామినేషన్ వేసే ఛాన్స్ ఇస్తారో ఇవాళ గానీ,రేపు గానీ తెలిసిపోనుంది.