- బిష్ణోయ్, ఖలిస్తాన్, ఐఎస్ ఐ మిలాఖత్?
- ఏడాదిలో 12 సార్లు దాడులు
- తాజాగా బీజేపి నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి
- నిందితుడు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు
- దాడి తమ పనేనన్న అంతర్జాతీయ ఉగ్రవాది హ్యాపీ పసియా
- ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్న లారెన్స్ బిష్ణోయ్?
- పంజాబ్ పోలీసులకు కొత్త తలనొప్పి
పంజాబ్ లో ఉగ్రవాద పోకడలు ప్రమాదకరంగా మారుతున్నాయి. జైల్లో ఉన్న కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, ఖలిస్తాన్ వేర్పాటువాద వర్గాలతోనూ, పాకిస్థాన్ ఐఎస్ఐతోనూ చేతులు కలిపినట్లు తాజా దాడులు అనుమానం కలిగిస్తున్నాయి. పంజాబ్ లోని జలంధర్ లో బీజేపి నేత మనోరంజన్ కాలియా ఇంటిపై గ్రెనేడ్ దాడి ఉదంతంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గ్రెనేడ్ దాడికి జీషన్ అక్తర్ అనే గ్యాంగ్ స్టర్ వ్యూహకర్త అని ఇతగాడు లారెన్స్ బిష్ణోయ్ కి సన్నిహిత సహచరుడనీ తెలుస్తోంది. అంతేకాదు ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖి హత్య కేసులో నిందితుడుగా తేలినట్లు పంజాబ్ పోలీసుల సమాచారం. పంజాబ్ లో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి సీమాంతర ఉగ్రవాదం ద్వారా పాక్ ఐఎస్ ఐ ఈ దాడికి పురికొల్పినట్లు దర్యాప్తులో తేలింది.
కాలియా ఇంటిపై గ్రెనేడ్ దాడి
బీజేపి నేత మనో రంజన్ కాలియా గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా, బీజేపి చీఫ్ గా కూడా పనిచేశారు.ఆగంతకులు ఆటో రిక్షా లోంచి గ్రెనేడ్ లు విసరడంతో కాలియా ఇంటి ముందున్న అల్యూమినియం పార్టిషన్, గ్లాస్ కిటికీలు ధ్వంసమయ్యాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగినప్పుడు కాలియా ఇంట్లోనే ఉన్నారు. ఇటీవల కాలంలో పంజాబ్ లో వరుస దాడులు జరుగుతుండటంతో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. తమ విజయాలను, పాలనలో అభివృద్ధిని సహించలేని వారే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని సీఎం భగవంత్ సింగ్ అంటున్నారు. గ్రెనేడ్ దాడికి పాల్పడిన నిందితుడిని, దాడికి వినియోగించిన ఈ- రిక్షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక్క ఏడాదిలోనే 12 సార్లు పేలుళ్లు..
దాడికి తామే కారకులమంటూ నిషేధిత బబ్బర్ ఖల్సా సంస్థకు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హ్యాపీ పస్సియా ప్రకటించాడు.దీనిని బట్టి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అటు ఖలిస్తాన్ తీవ్రవాద వర్గాలతోనూ, ఇటు ఐఎస్ ఐతోను కలసి పనిచేస్తోందని దర్యాప్తుసంస్థలు, భధ్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి.పంజాబ్ లో ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 పేలుళ్లు జరిగాయి.వీటిలో చాలా కేసుల్లో హ్యాపీ పస్సియా ప్రమేయం ఉందని తేలింది. ఇతగాడితో పాటు మరో గ్యాంగ్ స్టర్ జీవన్ ఫౌజీ కూడా పేలుళ్లకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరంతా అమృతసర్ లోని పోలీస్ స్థావరాలపైనే దాడులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ను విచ్ఛిన్నం చేసేందుకు దాడులు జరుపుతున్నారు.