25.6 C
Hyderabad
Monday, July 27, 2026

Live Video

spot_img

సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి 14 ప్రశ్నలు…!!

  • చర్చనీయాంశంగా రాష్ట్రపతులు, గవర్నర్ల అధికారాలు
  • కేంద్ర,రాష్ట్ర సంబంధాల విషయంలోనూ వివాదాలే
  • గవర్నర్ సలహాల ను ప్రభుత్వం విస్మరించవచ్చా?
  • గవర్నర్ పాత్రను ప్రభుత్వం ఓవర్ రైడ్ చేయోచ్చా?
  • ఈ రెండు పదవులు నిమిత్త మాత్రమా? రబ్బర్ స్టాంపేనా?
  • గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టులు సమీక్షించవచ్చా?
  • కోర్టు ఆదేశాలు గవర్నర్లు, రాస్ట్రపతులు పాటించాల్సిన అవసరముందా?
  • పరిధులు, అధికారాలు, పరిమితులపై ఎడతెగని చర్చ

ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించి ఆమోద ముద్ర వేసే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకున్న విచక్షణాధికారాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటు పాస్ చేసిన బిల్లులను ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్దేశిత టైమ్ ఫ్రేమ్ పెట్టడంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) ఆధారంగా సమీక్షించి అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు 14 అంశాలతో కూడిన ప్రశ్నలను సంధించింది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ 14 ప్రశ్నలతో కూడిన లేఖను సుప్రీం కోర్టుకు పంపారు. దేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలోనూ, ప్రభుత్వాల నిర్ణయాలకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించే విషయంలోనూ తరచుగా వివాదాలు రేగుతున్నాయి. తమిళనాడు గవర్నర్ కు ప్రభుత్వానికి ఈమధ్య జరిగిన ఘర్షణ, అలాగే కేసీఆర్ హయాంలో గవర్నర్ తమిళసైకి టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్యా అనేక వివాదాలే ఇందుకు తార్కాణం. గవర్నర్ నిర్ణయాధికారాలు ప్రశ్నార్ధకమైన ప్రతీసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. ఈ నేపధ్యంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలేంటి? వాటి వినియోగంలో కోర్టుల జోక్యం అనివార్యమా? అసలు కోర్టుల జోక్యం లేకుండా మరేదైనా ప్రత్యామ్నాయం మన రాజ్యాంగం కల్పించిందా చెప్పాలంటూ అందుకు సంబంధించిన 14 కీలక ప్రశ్నలను రాష్ట్రపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపారు. ఆ 14 ప్రశ్నల సారాంశం ఇది…

  1. రాజ్యాంగంలోని 200వ అధికరణం ప్రకారం రాష్ట్రప్రభుత్వం ఏదైనా బిల్లును గవర్నర్ ముందుపెడితే దానిపై నిర్ణయం తీసుకోడానికి గవర్నర్ కు రాజ్యాంగ బద్ధంగా ఉన్న అవకాశాలేంటి?
  2. ఆర్టికల్ 200 వ అధికరణం ప్రకారం ఏదైనా బిల్లును గవర్నర్ ముందుంచినప్పుడు దాని ఆమోద ముద్ర విషయంలో మంత్రి మండలి వెలువరించిన సలహాలు,సూచనలకు గవర్నర్ కట్టుబడి ఉండాలా? లేక మరేవైనా ఇతర మార్గాలున్నాయా?
  3. రాజ్యాంగంలోని 200వ అధికరణం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించడం సమర్ధనీయమేనా?
  4. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ద్వారా నిరోధించే అవకాశముందా?
  5. ఏదైనా బిల్లును సమీక్షించి ఆమోదించే విషయంలో గవర్నర్ అధికారాలు, గడువు నిర్దేశించేలా రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేకపోతే కోర్టుల ద్వారా గడువును నిర్దేశించే అవకాశముందా?
  6. భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 నిబంధన ద్వారా తన విచక్షణాధికారాలను వినియోగించవచ్చా?
  7. రాష్ట్రపతి అధికారాల వినియోగానికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి స్పష్టమైన గడువు, కాలపరిమితి లేనందున కోర్టులు జోక్యం చేసుకుని ఆ గడువును, విచక్షణాధికారాన్ని నిర్ణయించవచ్చా? ఇందుకు రాజ్యాంగంలోని 201 నిబంధన అనుమతిస్తుందా?
  8. ఏదైనా బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పుడు రాష్ట్రపతి విధులు, అధికారాలు రాజ్యాంగం ద్వారా నిర్దేశించినప్పుడు ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం తీసుకోడానికి సుప్రీంకోర్టు సలహా తీసుకోవాల్సిన అవసరముందా?
  9. గవర్నర్లు, రాష్ట్రపతులకు రాజ్యాంగం కల్పించిన 201,200 నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు చట్ట రూపం పొందుతున్న సమయంలో వారు జోక్యం చేసుకోవడం సమర్ధనీయమేనా? ఆ బిల్లు లేదా చట్టం లో ఏవైనా మార్పులు జోడించే ఆస్కారముందా?
  10. రాజ్యాంగంలో 142వ నిబంధన ప్రకారం గవర్నర్లు, రాష్ట్రపతులు తీసుకున్ననిర్ణయాలను, ఇచ్చిన ఆదేశాలను మార్చే అధికారం ఎవరికైనా ఉందా?
  11. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 నిబంధన ప్రకారం గవర్నర్ వ్యతిరేకించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా మార్చేసి అమలు చేసేయవచ్చా?
  12. ఆర్టికల్ 145 (3) ప్రకారం ఏ కోర్టు ఏకసభ్య బెంచ్ అయినా రాజ్యాంగ నిబంధనల అమలు విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే క్రమంలో ఆ కేసును కనీసం అయిదుగురు జడ్జిలు కలిగిన విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదా?
  13. ప్రొసీజరల్ లా విషయంలో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు పరిమితమైనవా?లేకరాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులకు విరుద్ధంగా భిన్నమైన ఆదేశాలను అమలు జరిపే అవకాశం ఉందా?
  14. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి రాజ్యాంగంలోని 131 ప్రకారం కోర్టులో దావా వేయడమే మార్గమా లేక సుప్రీంకోర్టులో ఏదైనా ప్రత్యేక పరిధిని రాజ్యాంగం నిర్ణయించిందా?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందేహాలతో కూడిన ప్రశ్నలను సుప్రీంకోర్టు పరిశీలనకు పంపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com