- పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి ఎన్‌ఆర్‌ఈజీఎస్
- యుక్తధార్ యాప్ ద్వారానే ఉపాధి హామీ కార్యకలాపాలు
ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్) ఇకముందు పూర్తి స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతోంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పై ఇప్పటి వరకూ కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ ఇకపై ఉండదు. ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అంతా తానై ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు కనీస పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తుంది. అయితే కేంద్రం నిధులు అయితే కేటాయిస్తుందు కానీ ఈ పథకం అమలు, నిధుల ఖర్చు, పనుల ఎంపిక వంటి వ్యవహారాలు చూసే బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వర్తించేవి. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు వినియోగంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు పెద్ద సంఖ్యంలో వచ్చేవి. దీంతో నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే అరోపణలను, అక్రమాలను అరికట్టి ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యుక్తధార్ పేరిట ఒక యాప్ తీసుకు వచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయితీలో యుక్తధార్ పోర్టర్ ద్వారా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తు్న్నారు. ఈ యాప్ పై అవగాహన కలిగించడానికి గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిక్షణా తరగతలు నిర్వహిస్తున్నారు.
ఇక నుంచి ఉపాధి హామీ పధకం అమలు సమస్తం ఈ యాప్ ద్వారానే నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనుల గుర్తింపు నుంచి మొదలు పనులకు వచ్చే కూలీల వివరాలు, బిల్లుల చెల్లింపు మొదలైనవన్నీ ఈ యుక్తధార్ యాప్ ద్వారానే జరుగుతాయి. జియో స్పేషియల్ ప్లానింగ్ పోర్టల్‌కు అనుగుణంగా యుక్తధార్ యాప్ పనిచేస్తుంది. ఈ నూతన విధానంలో ఉపాధి పనులను గుర్తించిన వెంటనే ఆయా పనులను జియో ట్యాగింగ్ ద్వారా యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చిన వివరాలు సైతం ఆ యాప్ లో పొందుపరచాలి. జియో ట్యాగింగ్ చేసిన పనుల వద్దే కూలీల ఫొటోలు తీసి యాప్ లో అప్‌లోడ్ చేయాలి. దీనివల్ల అవకతవకలకు తావుండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం వల్ల కూలీల వేతనాలు కూడా జాప్యం లేకుండా త్వరగా విడుదల అవుతాయి. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో అన్ని పంచాయతీల్లో యుక్తధార్ యాప్ ద్వారా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పధకం అమలు చేయనున్నట్లు డ్వామా అధికారులు చెపుతున్నారు.